ప్రజాభిప్రాయ సేకరణ.. బోగస్
రైతులకు తీవ్ర అన్యాయం..
పరిశ్రమల రాకతో అభివృద్ధి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా సాగింది. ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యూహాత్మకంగా వ్యవహరించి తమకు అనుకూలంగా ఉన్నవారితో మాట్లాడించిందని.. తమ అభిప్రాయాలు చెప్పనివ్వలేదని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న పలువురు.. పరిశ్రమ రాకను స్వాగతిస్తున్నామని, అదేవిధంగా కాలుష్య రహితంగా పరిశ్రమ ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు ఉద్యోగ, ఉపాది అవకాశాలతోపాటు గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. సీఎస్‌ఆర్ నిధులతో వీర్లపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల, క్రీడా ప్రాంగణం, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో వైటీపీఎస్ నిర్మాణంలో రైతులు భూములను వదులుకోగా ఇప్పటివరకు పరిహారం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కలేదని పేర్కొన్నారు.
సభా ప్రాంగణంలో బైఠాయింపు..
ప్రజాభిప్రాయ సేకరణ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. పలువురు ప్రజాసంఘాల నాయకులు, సామాజిక, పర్యావరణవేత్తలు వారి అభిప్రాయాలను వెలి బుచ్చేందుకు అధికారులు అవకాశం కల్పించలేదు. దీంతో తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, పీపుల్స్ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్లు కన్నెగంటి రవి, కె.రవిచందర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ రామయ్య, బంటు వెంకటేశ్వర్లు, వినోద్, ఎర్రనాయక్ తదితరులు అక్కడే బైఠాయించారు. ప్రజాభిప్రాయ సేకరణపై మండలానికి చెందిన నక్క శ్రీను, ధనావత్ శ్రీను కోర్టును ఆశ్రయించగా.. వారి అభిప్రాయాలను నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది. కానీ, అధికారులు మాత్రం వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు సభలో ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సభా ప్రాంగణం నుంచి బయటికి తీసుకెళ్లారు. ఈ గందరగోళం నడుమ ప్రజాభిప్రాయ సేకరణ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, వీర్లపాలెంతోపాటు సమీప గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, యువకులను శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం విడుదల చేశారు.
లిఫ్టుపై కొరవడిన స్పష్టత..
వీర్లపాలెం శివారులో రూ.32.22 కోట్లతో చేపట్టిన లిఫ్టు పనులు 40శాతం పూర్తయ్యాయి. కాగా ఇథనాల్ ఫ్యాక్టరీ భూముల మీదుగా లిఫ్టునకు సంబంధించిన పైపులైన్ వెళ్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ పనులు ప్రారంభించగానే ఫ్యాక్టరీ యాజమాన్యం పైపులైన్ నిర్మాణానికి అడ్డుపడకుండా ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రజాభిప్రాయ సేకరణ ఒక బోగస్. వీర్లపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అందరి అభిప్రాయాలను రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు పంపాలి. అప్రజాస్వామికంగా జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలి.
– రవిచందర్, తెలంగాణ
పీపుల్స్ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్
పచ్చని పంట పొలాలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతుల పాలిట ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల శాపంగా మారుతుంది. ఫ్యాక్టరీ వల్ల వచ్చే వ్యర్థాలు, కాలుష్యంతో కృష్ణా నీరు సైతం కలుషితమయ్యే పరిస్థితి దాపురించింది. ఈ పరిశ్రమ పంటలపై దుష్ప్రభావం చూపనుంది. మా వాదన వినిపించేందుకు వచ్చినప్పటికీ పోలీసులతో అడ్డురేని మాట్లాడకుండా చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
– పశ్య పద్మ, రైతు సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఫ ఇథనాల్ ఫ్యాక్టరీపై అభిప్రాయాలు చెప్పనివ్వలేదన్న ప్రజా సంఘాల నేతలు
ఫ సభా ప్రాంగణంలో నిరసన.. బయటికి తీసుకెళ్లిన పోలీసులు
ఫ అనుమానాలు నివృత్తి చేయాలని కోరిన స్థానికులు
పెట్టుబడులను స్వాగతిస్తాం
– ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమ యజమానులు.. ప్రజలు, రైతులను దృష్టిలో పెట్టుకోని పర్యావరణహితంగా, ప్రజలకు హాని కలుగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకై భూములిచ్చేవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
–ఎమ్మెల్సీ శంకర్‌నాయక్
పరిశ్రమల రాకతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. వీర్లపాలెం లిఫ్టు పైపులైన్ ఇథనాల్ పరిశ్రమ గుండా ఏర్పాటు చేసేందుకు అనుతించాలన్నారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంతో పచ్చదనాన్ని పూర్తిస్థాయిలో పెంచాలన్నారు.


