పెద్దవూర(నాగార్జునసాగర్) : సాగర్ జలాశయం నుంచి తాగునీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి, కృష్ణానది యాజమాన్యబోర్డు(కేఆర్‌ఎంబీ)కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. పల్నాడు ప్రాంతానికి రోజుకు 160 మిలియన్ లీటర్ల నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. సుమారు ఐదు మీటర్ల వ్యాసంతో ఇన్‌టేక్ వెల్‌తో పాటు జలాశయంలోని వివిధ నీటిమట్టాల నుంచి నీటిని తీసుకునేందుకు మూడు ఇన్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నాగార్జునసాగర్ కుడి వైపున ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం తదితరులతో కూడిన 8మంది రిటైర్డ్ ఇంజనీర్ల బృందం శుక్రవారం పరిశీలించింది. అనంతరం సాగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి రాక పోవడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో నీటి తరలింపు సామర్థాన్ని పెంచే అనుమానాలు ఉన్నాయన్నారు. తాగునీటి అవసరాలకు తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ నీటిహక్కులకు భంగం కలుగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్లు 83 నుంచి 87వరకు ఉన్న నిబధనలను ఇరు రాష్ట్రాలు పాటించాల్సిన అవసరముందన్నారు. ప్రాజెక్టు సాంకేతిక వివరాలు నీటి తరలింపు సామర్థ్యం, నీటిమట్టాలకు సంబంధించిన అంశాలను వెలండించి, తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. డ్యాం భద్రత, నిర్మాణాలపైన తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం, అనుమతులపై స్పష్టత కోరుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)కు తమ అసోసియేషన్ తరపున లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు. వీరి వెంట రిటైర్డ్ ఇంజనీర్లు గోలి దామోదర్‌రెడ్డి, సంగం చంద్రమౌళి, సత్తిరెడ్డి, కట్ల రమేశ్ ఉన్నారు.
నెల్లికల్లు లిప్టుతో సస్యశ్యామలం
తిరుమలగిరి(సాగర్) : నెల్లికల్లు లిఫ్టు ఇరిగేషన్ పూర్తయితే తిరుమలగిరి సాగర్ మండలం సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రిటైర్డ్ ఇంజినీర్ల బృందంతో కలిసి ఆయన నెల్లికల్లు లిఫ్టు ఇరిగేషన్ పనులను పరిశీలించి మాట్లాడారు. మొదటగా ఈ లిఫ్టు ఇరిగేషన్ 4200 ఎకరాలకే పరిమితం అయ్యిందని.. అప్పట్లో రిటైర్డ్ ఇంజినీర్ల బృందం పరిశీలించి సుమారుగా 26,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందిచవచ్చని నివేదించిందని తెలిపారు.
భవిష్యత్తులో నీటి మళ్లింపుపైనే ఆందోళన
తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్
అసోసియేషన్ వెల్లడి


