నల్లగొండ టౌన్: నల్లగొండలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తూ 191 మంది రోగుల మరణానికి కారణమైన ఐకాన్ ఆసుపత్రికి జిల్లా వైద్యారోగ్యశాఖ రూ.5 లక్షల జరిమానా విధించింది. రోగి చనిపోయినా ఐసీయూలో పెట్టి చికిత్స పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపి ఈ జరిమానా విధించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. అంతేకాక పరీక్షలు/ఇన్వెస్టిగేషన్ పేరుతో అధిక బిల్లులు వసూలు చేసినట్లు తనిఖీల్లో తేల్చామని పేర్కొన్నారు. నిబంధనల అమలులో లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు షోకాజు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించామన్నారు. యాజమాన్యం ఇచ్చిన వివరణలతో పాటు వచ్చిన ఫిర్యాదులు, తనిఖీ నివేదిక, అందుబాటులో ఉన్న రికార్డులు, ఇతర సంబంధిత ఆధారాలను జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. రెండు నెలల్లో లోపాలు సరిదిద్దుకోవాలని, వాటిపై రిజిస్ట్రేషన్ అథారిటీ తనిఖీ నిర్వహించి తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.


