నాకున్న ఆరెకరాల్లో వరిసాగు చేశాను. రోజుకు కనీసం 7 గంటలు కూడా కరెంట్ రావడం లేదు. పొలానికి నీరు పారడం లేదు. ఇప్పటికే మూడెకరాల పొలం ఎండింది. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. 12 గంటల పాటు కరెంట్ అందించి పంటలను కాపాడాలి.
– ఊరిబండి మల్లయ్య, రైతు, కుక్కడం
రోజుకు 10 నుంచి 12 గంటలు విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డివిజన్ వ్యాప్తంగా రోజూ 6 మిలియన్ యూనిట్లు (400 మెగా వాట్స్) సరఫరా చేస్తున్నాం. మరింత విద్యుత్ అవసరం ఉన్నప్పుడు ఉన్నతాధికారుల ఆదేశానుసారం అదనంగా సరఫరా చేస్తాం.
– శ్రీనివాసచారి, విద్యుత్ డీఈ, మిర్యాలగూడ
మిర్యాలగూడ : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతుకు నిత్యం కష్టాలే ఎదురవుతున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో బోరుబావుల కింద వరితోపాటు ఇతర పంటలు సాగు చేసిన రైతులకు అప్రకటిత విద్యుత్ కోతలతో నీళ్లందడం లేదు. దీంతో వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భూగర్భ జలం అడుగంటి..
సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎల్‌నినో ప్రభావంతో ముఖం చాటేశాయి. వర్షపాతం సాధారణం కంటే 20 శాతం లోటు కావడంతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండలేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో రైతులు బోరుబావుల కింద వరితోపాటు ఇతర పంటలు సాగు చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్త బోర్లు వేస్తున్నా చుక్కనీరు పడటం లేదు.
పెరిగిన విద్యుత్ డిమాండ్‌తో తప్పని కోతలు
రైతులు బోర్లపై ఆధారపడడంతో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. జిల్లాలో సాధారణ విద్యుత్ వినియోగం 14 మిలియన్ యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం అది 19 మిలియన్ యూనిట్లకు చేరింది. అనుమతులు లేకుండా వేస్తున్న కొత్త బోర్లు, మోటార్ల వాడకంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడి తరచూ ట్రిప్ అవుతున్నాయి. రైతులకు రోజూ 12 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ.. కేవలం 4 నుంచి 6 గంటలకే పరిమితం అవుతోంది.
రైతుల ఆందోళన బాట
నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు కేవలం 15 రోజులు మాత్రమే నీరు విడుదల చేసిన అధికారులు.. మంగళవారం నిలిపివేశారు. వినాయక నిమజ్జనం కోసమని బుధవార మధ్యాహ్నం నుంచి మళ్లీ విడుదల చేస్తున్నారు. అయితే చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ సమస్యపై రైతులు సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు దిగుతున్నారు. అధికారులు స్పందించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఫ అప్రకటిత విద్యుత్ కోతలతో తడారుతున్న పొలాలు
ఫ సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు
ఫ జిల్లా వ్యాప్తంగా బోర్ల కింద 2.50 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు


