ఇప్పుడు భూసేకరణ తక్కువే..
కోదాడ, చిట్యాల : హైదరాబాద్– విజయవాడ జాతీయరహదారి(ఎన్‌హెచ్–65)ని నాలుగు నుంచి ఆరు లేన్లుగా విస్తరణకు ముందడుగు పడింది. బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) విధానంలో రోడ్డు విస్తరించే పనులకు టెండర్లను ఆహ్వానిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన విస్తరణ డీపీఆర్‌కు పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజర్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ (సీసీఈఏ) తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇది లాంఛనమేనని సమాచారం. నవంబర్ 25న టెండర్లు ఖరారు చేయనున్నారు. జాతీయ రహదారి–65ను దండు మల్కాపురం నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు మూడు ప్యాకేజీలుగా విభజించి విస్తరణ పనులు చేయపట్టనుండగా యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని మునగచర్ల వరకు మొదటి ప్యాకేజీ కింద రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించనున్నారు.
మొదటి ప్యాకేజీలోనే..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నందిగామ వరకు మొదటి ప్యాకేజీ కింద పనులు చేపట్టనున్నారు. ఇందులో మొత్తం 181.300 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకు గానూ రూ. 6,792.52 కోట్ల అంచనా వ్యయంతో ఎన్‌హెచ్ అధికారులు టెండర్లు పిలిచారు. దండుమల్కాపురం నుంచి తెలంగాణ–ఏపీ సరిహద్దుగా ఉన్న కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వరకు 155 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు.
పరిమిత సంఖ్యలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు
జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్‌రోడ్లను, అండర్‌పాస్‌లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. రహదారిపైకి రావడానికి 15 నుంచి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ మాత్రమే ఉంటుందని, ఇష్టానుసారంగా రోడ్డుమీదకు రావడానికి వీలుండదని జాతీయ రహదారుల అధికారులు చెబుతున్నారు. రోడ్డు వెంట ఉన్నవారు సర్వీస్ రోడ్డను, రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు నిర్మాణంలో లోపాలను సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. దండు మల్కాపురం నుంచి నందిగామ వరకు 60 వెహికిల్ అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టనుండగా .. ఉమ్మడి జిల్లా పరిధిలో అదనంగా మరో 36 అండర్‌పాస్‌లు రానున్నాయి. గుర్తించిన ప్రదేశాలలో పశువులు రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా 10 అండర్‌పాస్‌ల నిర్మాణం చేయనున్నారు.
స్మార్ట్ హైవేగా..
ఎన్‌హెచ్–65ను ఆరులేన్లుగా విస్తరించే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత హైసెక్యూరిటీ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఏఐ అనుసంధాన సీసీ కెమెరాలను అమర్చి నిత్యం నిఘాను ఏర్పాటు చేయనున్నారు. ఏఎన్‌పీఆర్(ఆటోమెటిక్ నంబర్‌ప్లెట్ రికగ్నేషన్) కెమెరాల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర వివరాలను గుర్తించనున్నారు. ఈ కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్ కాంతి ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాల చిత్రాలను వందశాతం క్లారిటీగా తీయగలుగుతాయి.
ఫ రూ. 6,792.52 కోట్లతో 181.3 కి.మీ విస్తరణ
ఫ దండుమల్కాపురం– నందిగామ వరకు మొదటి ప్యాకేజీ
ఫ ఉమ్మడి జిల్లాలో 155 కి.మీ మేర వెడల్పు
ఫ పూర్తిస్థాయిలో అండర్‌పాస్‌లు,
సర్వీస్‌రోడ్ల నిర్వహణ
జాతీయ రహదారి – 65 విస్తరణకు టెండర్లు
2012లో విజయవాడ–హైదరాబాద్ హైవేను నాలుగు లేన్లుగా విస్తరించిన సమయంలోనే 6 వరుసలకు అవసరమయ్యే భూమిని ఎన్‌హెచ్ అధికారులు సేకరించారు. కల్వర్టులు, ప్లైఓవర్‌లు, వంతెనలు సైతం ఆరు వరుసలకు సరిపోయేలా నిర్మించారు. దాంతో ప్రస్తుతం ఆరు వరుసల రోడ్డు విస్తరణకు భూసేకరణ పెద్దగా అవసరం ఉండదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 25.8 హెక్టార్లు (సుమారు 64 ఎకరాల) భూమిని సేకరించనున్నారు. భూ సేకరణ బాధ్యతను ఉమ్మడి జిల్లాలోని నలుగురు ఆర్డీఓలకు అప్పగించారు. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల పరిధిలో 6.32 హెక్టార్ల భూముల సేకరణకు నల్లగొండ ఆర్డీఓ నోటిఫికేషన్ జారీ చేశారు. భువనగిరి, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్ జారీచేయనున్నారు.


