నల్లగొండ : ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని ఈసారి నేరుగా మిల్లులకు కేటాయించకుండా గోదాముల్లోనే నిల్వ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలనినుంచి ఆదేశాలు రావడంతో జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు గోదాములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
మిల్లింగ్‌పై వివాదాల నేపథ్యంలో..
గత యాసంగిలో దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించడం, దానికి బదులుగా ప్రభుత్వానికి రావాల్సిన రా రైస్ విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ వానాకాలంలో కొనుగోలు చేసే సన్నధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించకుండా నిల్వ చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసి, ప్రభుత్వ అవసరానికి అనుగుణంగా మిల్లింగ్ చేయించుకోవాలనే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించే విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు.


