మునుగోడు : పత్తి సాగు చేసే రైతులు ఎకరం భూమిలో కనీసం 15 వేల మొక్కలను పెంచితే మంచి దిగుబడి పొందవచ్చని కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత డాక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. పత్తి సాగులో మెళకువలపై మండలంలోని కొరటికల్ గ్రామంలో రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరానికి 15 వేల మొక్కలు నాటి దిగుబడి తీస్తే పంట కాలపరిమితి తగ్గి అదే భూ మిలో రెండో పంట సాగు చేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పద్మజ, కొరటికల్ సర్పంచ్ అద్దంకి రామలింగం, ఉప సర్పంచ్ మందుల అంజయ్య, ఏఈఓ వెంకటేష్ పాల్గొన్నారు.
వృద్ధులను గౌరవిద్దాం
నల్లగొండ: ప్రతిఒక్కరం వయో వృద్ధులను గౌరవిద్దామని జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ నంద్యాల ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించ తలపెట్టిన వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్, వయోవృద్ధుల హక్కుల పుస్తకాలను శుక్రవారం ఆయన నల్లగొండ కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 26న సాంస్కృతిక కార్యక్రమాలు, 27న ఆర్థిక లావాదేవీలపై, సైబర్ నేరాల పట్ల అవగాహన, 28న యోగా సాధన, 29న వృద్దుల చట్టాలపై అవగాహన సదస్సులు ఉంటాయన్నారు. 30న చిన్నారుల చేత తల్లిదండ్రులను, వృద్ధులను గౌరవించాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో వయోవృద్ధులకు, వారికి సేవలు చేసిన వ్యక్తులకు సన్మానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లావణ్య కుమారి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, వయోవృద్ధుల సంరక్షణ కేంద్రం కోఆర్డినేటర్ నవీన్, సముద్రాల మల్లికార్జున్, సుదర్శన్‌రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు వరం.. ‘బీఆర్‌ఏఓయూ’
మిర్యాలగూడ టౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) ద్వారా అందిస్తున్న విద్యా కోర్సులు పేద విద్యార్థులకు గొప్ప వరం లాంటివని ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి.ధర్మానాయక్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో బీఆర్‌ఏఓయూ ప్రవేశాల పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యయన కేంద్రం కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దూరవిద్య ద్వారా వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రధానాచార్యులు మలిగిరెడ్డి భీమార్జున్‌రెడ్డి, కో–ఆర్డినేటర్ పి.నాగరాజు, జాక్టో ఎం.వెంకన్న, అధ్యయన కేంద్రం కౌన్సిలర్లు పాల్గొన్నారు.


