యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌పై పులుముకున్న రాజకీయం | - | Sakshi
Sakshi News home page

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌పై పులుముకున్న రాజకీయం

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

మొన్న సాగర్‌ నీరు.. నేడు కరెంట్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం రాజకీయ రంగు పులుముకుంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని 4 వేల మెగావాట్ల యాదాద్రి ఽథర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో బొగ్గు కొరత కారణంగా రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోగా మరో రెండు యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బొగ్గు కొరత, సాంకేతిక కారణాల సాకుతో ఉత్పత్తి నిలిపివేశారని, విద్యుత్‌ సరఫరా చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం, బొగ్గు రవాణా అంశాల్లో గత ప్రభుత్వ హయాంలోనే లోపాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్‌ నాయకులు విమర్శించడం రాజకీయ రచ్చగా మారింది.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల పరిశీలన

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్‌ఎస్‌ నాయకులు దామరచర్ల పరిధిలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి పరిస్థితి, బొగ్గు నిల్వలు, యూనిట్ల పనితీరుపై వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వ తీరుపై ఆయన మీడియాలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మళ్లీ విద్యుత్‌ సమస్య తీవ్రం అవుతుందని ఆరోపించారు. ఇళ్లకు విద్యుత్‌ కోతలు, పరిశ్రమలకు జనరేటర్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కరెంట్‌ లేక రైతులు డీజిల్‌, జనరేటర్లను ఉపయోగించాల్సి వస్తుందంటూ తీవ్రంగా విమర్శించారు. విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

పోటీగా కాంగ్రెస్‌ శ్రేణులు

బీఆర్‌ఎస్‌ నాయకులు పవర్‌ ప్లాంట్‌ను సందర్శించిన విషయం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్లాంట్‌ వద్దకు చేరుకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ప్లాంట్‌ను సందర్శించారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు, నాయకుల లాభాల కోసమే నిర్మించిందంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. వారికి ఆ ప్లాంట్‌ లాభాలు తెచ్చే వనరుగా మారిందని అందులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బొగ్గే లేని చోట ఎలా నిర్మించారంటూ విమర్శించడంతోపాటు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో సాంకేతిక సమస్యను రాజకీయ అంశంగా మార్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలను దుయ్యబట్టారు. ప్రతిపక్ష, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల విమర్శలు, ప్రతి విమర్శలతో పవర్‌ ప్లాంట్‌ విద్యుతు ఉత్పత్తి అంశం రాజకీయ రచ్చకు దారితీసింది.

ఫ బొగ్గు కొరతతో రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేత

ఫ మరో రెండింటిలోనే కొనసాగింపు

ఫ ప్లాంట్‌ను పరిశీలించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

ఫ పోటీగా పవర్‌ ప్లాంట్‌ వద్దకు చేరుకున్న కాంగ్రెస్‌ నాయకులు

ఫ ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు

సంధించుకున్న ఇరు పార్టీల నేతలు

మిర్యాలగూడ కేంద్రంగా ఇటీవల సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల అంశంగా రాజకీయ వివాదంగా మారింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో రైతు దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. నీటి విడుదల చేయాలని లేకపోతే పాదయాత్ర చేస్తానని కేటీఆర్‌ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. దీనికి పోటీగా అదేరోజు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం అప్పట్లో చర్చనీయంశంగా మారింది. తాజాగా యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి అంశం కూడా ఇదే తరహాలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరుకు వేదికగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement