అప్పట్లో రా రైస్‌పైనే అభ్యంతరాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మిగులు ధాన్యాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో ధాన్యం అధిక దిగుబడి రావడంతో ప్రభుత్వం ఎక్కువగా కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ధాన్యాన్నే కొన్ని మిల్లులకు సామర్థ్యానికి మించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం అప్పగించింది. ప్రస్తుతం అందులో మిగిలిన ధాన్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది.
విక్రయానికి 1.35 లక్షల మెట్రిక్ టన్నులు
సాధారణంగా ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల నుంచి 6.5 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది. గత యాసంగిలో అధిక దిగుబడి రావడంతో 7.74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందులోని 45 మిల్లులకు కేటాయించిన ధాన్యంలోని 1,35,481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రస్తుతం విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు బిడ్లు స్వీకరించనున్నారు. వేలం ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికై న బిడ్డర్లకు ధాన్యాన్ని కేటాయించనుంది.
వేలం ధర ఇలా..
ప్రభుత్వం మిగులు ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,389 చొప్పున వేలం వేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వం రైతులనుంచి కొనుగోలు చేసిన ధరనే వేలానికి ఖరారు చేసింది. దీంతో వేలంలో మిల్లర్లు పాల్గొంటారా లేదా అనేది అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అధికారుల తనిఖీలతో ఆందోళన
ఒక పక్క బాయిల్డ్ రైస్ అవకాశం ఇవ్వకపోవడం, మరో పక్క మిల్లుల్లో తనిఖీలు చేయడం మిల్లర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.జిల్లాలో వేలం వేసిన ధాన్యానికి సంబంధించి ఏడు మిల్లులు మాత్రమే ప్రభుత్వానికి రూ.వందల కోట్ల బకాయి పడ్డాయని, కావాల్సివస్తే వాటిల్లో తనిఖీలు చేసుకోవాలని, అందుకు అసోసియేషన్ తరఫున సహకరిస్తామని, అంతేతప్ప తనిఖీల పేరుతో అందరినీ ఇబ్బందులపాలు చేయవద్దని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మిగులు ధాన్యాన్ని వేలం వేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బుధవారం మళ్లీ జిల్లాలో 5 మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ధాన్యం నిల్వ లెక్కలను పోల్చి చూస్తే తేడాలున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. గత బుధవారం కూడా రెండు మిల్లుల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. పైగా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఏ అధికారి ఏ మిల్లుకు ఏ రోజు వెళ్లాలనేది రాష్ట్ర స్థాయిలోనే పౌర సరఫరాల అధికారులు ప్రణాళికాబద్ధంగా తనిఖీలు చేపడుతుండడంతో మిల్లర్లతో ఆందోళన నెలకొంది.
ఫ గత యాసంగిలో సామర్థ్యానికి మించి కేటాయింపు
ఫ జిల్లాలో అదనంగా 1,35,481 లక్షల మెట్రిక్ టన్నులు
ఫ ఆ ధాన్యమే వేలం వేస్తున్న యంత్రాంగం
ఫ 28 వరకు బిడ్ల్ల దాఖలుకు అవకాశం
ఫ మిల్లర్లు పాల్గొనడంపై అనుమానాలు
యాసంగి ధాన్యం సేకరణ సమయంలో మిల్లర్లు ప్రభుత్వానికి బాయిల్డు రైస్‌కు అవకాశం ఇవ్వాలని విన్నవించుకున్నారు. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని రారైస్‌గా పడితే నూక శాతం అధికంగా ఉంటుందని, క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల రారైస్ ఇవ్వడం సాధ్యం కాదని, తాము నష్టపోతామని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్పట్లో కొంత మేర బాయిల్డ్ రైస్ ఇచ్చేలా అవకాశం కల్పించారు. ఆ తరువాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాట మార్చి పూర్తిగా రారైస్ ఇవ్వాలని చెప్పడంతో మిల్లర్లు సమ్మెబాట పట్టారు.


