నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా అంతటా జోరువాన కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 21.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అయితే జిల్లాలో 6.40 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా సరైన వర్షాలు లేవు. ఫలితంగా పత్తిచేలు పిందే దశలో సరైన ఎదుగుదల లేని కారణంగా వాడుబట్టాయి. కొన్ని ప్రాంతాల్లో జానెడు ఎత్తులోనే పత్తిచేలు పూత పూసి కాయదశకు చేరుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పత్తి పగిలి ఏరే దశలో ఉంది. అయితే ప్రస్తుతం కురిసిన వర్షాలు కొనఊపిరిలో ఉన్న పత్తి చేలకు జీవం పోసినట్లయింది. ఎండితున్న వరిచేలు, ఇతర మెట్టపంటలకు కూడా మేలు జరిగింది. ఈ సీజన్‌లో తక్కువ వర్షాలు కురుస్తున్నందున పెట్టిన పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి కనపడటం లేదని, ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం వరకు కురిసిన వర్షంతో రైతులు ఆనందపడుతున్నారు.
కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లో అత్యధికం
జిల్లాలోని కేతేపల్లి మండలంలో అత్యధికంగా 69.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఆ తర్వాత శాలిగౌరారం మండలంలో 67.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గట్టుప్పల్, కొండమల్లేపల్లి మండలాల్లో 2 మి.మీ. నుంచి 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్షమొచ్చినా.. కుంటల్లోకి చేరని నీరు
బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లపై వరదనీరు ప్రవహించింది. పలు చోట్ల పత్తిచేలు, వరిపొలాల్లోకి భారీగా నీరు చేరాయి. కానీ ఈ సీజన్‌లో చాలా రోజుల తర్వాత వర్షం కురడంతో ఇప్పటికే నెర్రెలు బారిఉన్న పొలాలు, భూముల్లోకే వర్షపునీరు ఇంకిపోయింది. దీంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద నీరు చేరిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు.
బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పత్తిచేలకు ఎంతో మేలు జరగనుంది. వాడు దశలో ఉన్న చేలకు వర్షం జీవం పోసినట్లయింది. రైతులు అదును చూసుకుని ఎరువులు తెచ్చుకుంటే మంచిది. ఇప్పుడు ఎరువులు పెట్టుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
– వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి
ఫ వాయుగుండం కారణంగా అన్ని మండలాల్లో కురిసిన వర్షం
ఫ జిల్లాలో 21.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదు
ఫ వాడుబడిన పత్తిచేలు, వరిపొలాలకు జీవం
ఫ ఆనందంలో రైతాంగం


