నల్లగొండ టౌన్ : ఆయుష్ సేవలను గ్రామీణస్థాయిలో విస్తరించాలని ఆయుష్ శాఖ రాష్ట్ర రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవినాయక్ అన్నారు. ధన్వంతరి జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఆయుష్ శాఖ కార్యాలయంలో ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలోని హెర్బల్ గార్డెన్‌లో మొక్కలు నాటి మాట్లాడారు. ఆయుర్వేదంతో పాటు యునాని, హోమియోపతి వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయుష్ వైద్యంలో ఔషధ మొక్కలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రతి ఒక్కరూ ఔషధ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపాలని కోరారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుహాసిని సోలోమోనిని సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ రుచిత, డీపీఎం కళ్యాణ్, ఫార్మసిస్టులు భుజంగరావు, విజయలక్ష్మి, మెర్సీ తదితరులు పాల్గొన్నారు.


