సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం నిల్వల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. రైస్ మిల్లుల్లో ప్రతి బుధవారం తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. తనిఖీలకు వెళ్లే అధికారులను కూడా ర్యాండమైజేషన్ విధానంలో ఎంపిక చేసి, రాష్ట్రస్థాయిలోనే ఖరారు చేయడం ద్వారా ఎక్కడా ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. గత వారం నిర్వహించిన తనిఖీల్లో పలు రైస్ మిల్లుల్లో నిల్వలు, రికార్డులు, ధాన్యం లెక్కల్లో లోపాలు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మిల్లులపై మరింత నిఘా పెంచారు.
లోపాలు ఉంటే నోటీసుల జారీ..
ప్రతి బుధవారం తనిఖీలు నిర్వహించాలన్న నిర్ణయంలో భాగంగా పోయిన బుధవారం జిల్లా అధికారులు పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. చిట్యాలలోని రెండు మిల్లుల్లో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అఽధికారి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. వాటిల్లో 2024–25 వానాకాలం, యాసంగి, 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఉండాల్సిన దానికంటే తక్కువ ధాన్యం ఉన్నట్లు తేల్చారు. వారికి నోటీసులు జారీ చేశారు. తదుపరి చర్యలుచేపట్టనున్నారు. ఈనెల 23వ తేదీన మరిన్ని మిల్లుల్లో తనిఖీలు చేపట్టనున్నారు. మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలించడంతోపాటు రికార్డుల్లో నమోదైన వివరాలు, వాస్తవ నిల్వలను సరిపోల్చి చూడనున్నారు.
రంగంలోకి తహసీల్దార్లు, డీటీలు..
ఇప్పటివరకు సంబంధిత శాఖల అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలకు అదనంగా ఈసారి నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను కూడా రంగంలోకి దింపుతున్నారు. వారికి కేటాయించిన మిల్లులకు వెళ్లి ధాన్యం నిల్వలను ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు రికార్డులను తనిఖీ చేయనున్నారు. తనిఖీల్లో ఏవైనా తేడాలు, అక్రమాలు గుర్తిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు నోటీసులు జారీ చేసి, పెద్ద మొత్తంలో తేడాలు ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
తనిఖీలపైనా సూపర్ చెక్
జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు పూర్తి చేశాక వాటికి సంబంధించిన నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఈ తనిఖీలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు సూపర్ చెక్ చేస్తారు. ఆ వివరాలు సరిగా లేకుంటే సదరు ఆ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల జిల్లా స్థాయి అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తేడాలు ఉన్నట్లుగా సూపర్‌చెక్‌లో తేలింది. వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఫ ప్రతి బుధవారం మిల్లుల్లో తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఫ తనిఖీలకు వెళ్లే అధికారులకు రాష్ట్రస్థాయిలోనే ర్యాండమైజేషన్
ఫ జిల్లా అధికారుల తనిఖీలపై ఉన్నతస్థాయిలో సూపర్ చెక్


