విద్యార్థుల జీవితాన్ని మార్చేది గురువులే.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాన్ని మార్చేది గురువులే..

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

నల్లగొండ : విద్యార్థుల జీవితాలను మార్చేది గురువులేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు.. జీవిత లక్ష్యాలను నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10 శాతం తగ్గగా.. నల్లగొండ జిల్లాలో మాత్రం 9 శాతం పెరగడం.. ఇక్కడి ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనమన్నారు. విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి గల కారణాలపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ఇందులో భాగంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నల్లగొండలో రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు. చదువు మధ్యలోనే మానేసేవారి వివరాలను సేకరించి అందుకు గల కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు.

సృజనాత్మకతను వెలికితీయాలి..

కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమమన్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శ్రీపాల్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్య, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, డిప్యూటీ మేయర్‌ అమీర్‌ అలీ, డీఈఓ సుశీందర్‌రావు, కార్పొరేటర్‌ గుమ్మల జానకి తదితరులు పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement