యువ ‘ఆపదమిత్ర’శిక్షణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

యువ ‘ఆపదమిత్ర’శిక్షణ పూర్తి

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

రామగిరి(నల్లగొండ) : అన్నెపర్తిలోని 12వ బెటాలియన్‌ టీజీపీఎస్సీ కమాండెంట్‌ కెబి.రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపదమిత్ర మొదటి బ్యాచ్‌ శిక్షణ మంగళవారం ముగిసింది. ముగింపు వేడుకకు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ హాజరైన మాట్లాడారు. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో యువ ఆపద మిత్రలు.. పోలీస్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు తోడుగా నిలిచి ప్రజలకు తగిన సహాయసహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు కలెక్టర్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, అత్యవసర రక్షణ పరికరాలతో కూడిన కిట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఎం.గౌతమ్‌రెడ్డి, అడిషనల్‌ కమాండెంట్‌ నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ నర్సింగ్‌ వెంకన్న, ఆర్‌ఐ రవీందర్‌ పాల్గొన్నారు.

నేడు విద్యాసంస్థలకు సెలవు

నల్లగొండ : గణేష్‌ నిమజ్జనం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రహదారులపై రద్దీ, ట్రాఫిక్‌ సమస్యలు, భారీగా విగ్రహాల నిమజ్జనం ఉన్నందున విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ స్థానిక సెలవుకు బదులుగా రాబోయే సాధారణ సెలవు దినమైన 10.10.2026 (రెండవ శనివారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు సాధారణ పనిదినంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ ఉత్తర్వులను జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు.

25న జాబ్‌మేళా

నల్లగొండ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగులు అదేరోజు నేరుగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు. అర్హత, వేతనం, తదితర పూర్తి వివరాలకు 08682 233362 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించొద్దు

దేవరకొండ : నిబంధనలు పాటించని ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ కె.రాహుల్‌ హెచ్చరించారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న బాలాజీ ఎక్స్‌రే సెంటర్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. దేవరకొండలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్ల యాజమాన్యాలు తమ రిజిస్ట్రేషన్‌, అనుమతులు, లైసెన్సును గడువు ముగియక ముందే పునరుద్ధరించుకోవాలని సూచించారు. తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి నగేష్‌, అంజయ్యగౌడ్‌, విజయప్రసాద్‌, కలీం, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

చెర్వుగట్టు హుండీ ఆదాయం 39,53,542

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాననికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడిగా 67 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం ఆలయ మహా మండపంలో లెక్కించారు. రూ.39,53,542 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ మోహన్‌బాబు తెలిపారు. అన్నదానం హుండీ ద్వారా రూ.37,771 వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్‌ వరాల రమేష్‌, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, ధర్మకర్తలు యాదయ్య, మల్లేష్‌, రేగట్టె శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, సంపత్‌, రఘునాథ్‌, అనిత, శ్రీను, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement