రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాల ఎన్‌సిసి క్యాడెట్లు మారక ద్రవ్యాల (డ్రగ్స్) వినియోగానికి వ్యతిరేకంగా మంగళవారం నల్లగొండ పట్టణంలో బృహత్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి – ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ చిలుముల సుధాకర్, సుబేదార్ కొమ్ము మల్లయ్య మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి, గంజాయి, ఇతర డ్రగ్స్ నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.


