నీళ్లులేక నిలువునా ఎండుతున్న వరి, పత్తి
కాలం కాటేసింది.. కరెంటు కష్టాలు తోడయ్యాయి.. వెరసి అన్నదాత ఆశలు ఆవిరయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు వట్టిపోవడంతో గుక్కెడు నీళ్లు లేక పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పంటను పశువులకు వదిలేస్తున్నారు.
పత్తి చేనులో దిగాలుగా కూర్చున్న ఈ మహిళా రైతు సపావట్ సుకన్య. చందంపేట మండలం బిల్డింగ్‌తండాకు చెందిన ఈమె తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో పత్తి చేను వాడు పట్టింది. గతంలో అదే చేనులో 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడు పెట్టుబడి మొత్తంగా రూ.2లక్షలు ఖర్చయిందని, ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతోంది.
ఫ అడుగంటిన భూగర్భ జలాలు.. వట్టిపోతున్న బోర్లు
ఫ లోవోల్టేజీ, కరెంటు కోతలతో మరిన్ని కష్టాలు
ఫ చేలను పశువులకు వదిలేస్తున్న రైతులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు కురవక, చెరువులు, కుంటల్లో నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. అక్కడక్కడా పని చేస్తున్న బోర్లతో మిగిలిన పంటను కాపాడుకుందామనుకుంటే విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు శాపంగా మారాయి. గంటల తరబడి కరెంటు కోసం ఎదురుచూడాల్సి రావడం, వచ్చినా మళ్లీ మధ్యలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో పొలాలకు నీరందడం లేదు. దీంతో చాల పాంత్రాల్లో ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి.
అనధికార విద్యుత్ కోతలు
జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. గతంలో 18 గంటలు ఇచ్చిన విద్యుత్ సరఫరాను కుదించారు. ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు కోత పెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. మునుగోడు డివిజన్‌లో జూన్‌లో 18 గంటల త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వగా.. ప్రస్తుతం తగ్గించేశారు. చండూరు, జిల్లాలోని ఇతర మండలాల్లో ఏడెనిమిది గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
లక్ష ఎకరాల్లో ఎండిన పంటలు
జిల్లాలో ఈ వానాకాలంలో 4,39,617 ఎకరాల్లో వరి, 6,01,459 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇతర పంటలు కలుపుకొని 10,76,573 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. ప్రస్తుతం నల్లగొండ, కనగల్, మునుగోడు మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయాయి. ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా మొత్తంగా జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
కనగల్ మండలం బుడుమర్లపల్లిలో బీటలువారిన వరి చేను, చందంపేట మండలం బిల్డింగ్‌తండాలో వర్షాలు లేక వాడుపట్టిన పని చేను


