నెలాఖరులోగా గుర్తిస్తాం
నల్లగొండ : వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో నిల్వ సామర్థ్యం సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తిస్తున్నారు. ధాన్యం నిల్వకు అనువుగా ఉన్న ప్రైవేట్ గోదాంలు, మార్కెట్ యార్డులు, మూతపడిన ఫంక్షన్ హాళ్లు, వినియోగంలో లేని ఇండస్ట్రియల్ భవనాలు, రైతువేదికలు, మార్కెట్ యార్డుల్లోని ఖాళీ ప్రదేశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత నిల్వకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఏర్పాట్లు చేయాలన్న ఉద్దేశంతో ఈ కసరత్తు చేపడుతున్నారు.
తహసీల్దార్లకు బాధ్యత..
ధాన్యం నిల్వకు అవసరమైన స్థలాల గుర్తింపు బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు తహసీల్దార్లకు కూడా అప్పగించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతువేదికలు, ఇతర అందుబాటులో ఉన్న ప్రదేశాలను వారు పరిశీలిస్తున్నారు. స్థల విస్తీర్ణం, ధాన్యం నిల్వకు అనుకూలత తదితర అంశాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ నెల 30లోగా నివేదిక..
వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అనంతరం నిల్వకు అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తించిన స్థలాల వివరాలతో కూడిన నివేదికలను ఈ నెల 30లోగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు పంపించనున్నారు.
తుది నిర్ణయం ఎస్‌డబ్ల్యూఎస్‌దే..
అధికారులు గుర్తించిన అన్ని స్థలాలను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (ఎస్‌డబ్ల్యూఎస్) అధికారులు పరిశీలించి, ధాన్యం నిల్వకు అనువుగా ఉన్న వాటిని తుది ఎంపిక చేయనున్నారు. ఎస్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్ణయించే రేట్ల ప్రకారం ఎంపిక చేసిన స్థలాలకు అద్దె చెల్లించి వినియోగించుకోనున్నారు. ధాన్యం నిల్వకు అవసరమైన స్థలాల తుది నిర్ణయం కూడా సంబంధిత ఎస్‌డబ్ల్యూఎస్ అధికారుల పరిశీలన అనంతరం జరుగుతుంది.
ఆరుబయట నిల్వకు చెక్..
గతంలో ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లులకు అప్పగించిన సమయంలో కొన్ని మిల్లుల్లో స్థలం లేకపోవడంతో ధాన్యాన్ని ఆరుబయట లాట్లుగా ఏర్పాటు చేసి టార్పాలిన్లతో కప్పి ఉంచేవారు. వర్షాలు కురిసిన సందర్భాల్లో ధాన్యం కొంత తడిసి దెబ్బతినేది. మరోవైపు మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం రావడం కూడా నిల్వ సమస్యకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉంచనున్నారు.
ధాన్యం నిల్వల కోసం స్థలాలను గుర్తించాలని కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నెల చివరిలోగా స్థలాలను గుర్తించి నివేదికను పంపిస్తాం. గుర్తించిన స్థలాలను ఎస్‌డబ్ల్యూఎస్ అధికారులే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.
– రాంపతి, పౌరసరఫరాల శాఖ డీఎం
ఫ ధాన్యం కొనుగోళ్లకు ముందే కసరత్తు
ఫ మిల్లుల్లో నిల్వ సామర్థ్యం సరిపోక.. ప్రత్యామ్నాయాల గుర్తింపు
ఫ ప్రైవేట్ గోదాంలు, మార్కెట్ యార్డులు, రైతువేదికల పరిశీలన


