రామగిరి (నల్లగొండ) : కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ బి.చంద్రశేఖర్.. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. 88 మంది దరఖాస్తుదారులు సమర్పించారు. వీటిలో ఎక్కువగా వ్యక్తిగత భూసమస్యలు, ఉద్యోగ, ఉపాధి, పెన్షన్లు, నిధుల విడుదలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు ప్రతివారం తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా ప్రతి శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఆర్‌ఓ దశరథ్ పాల్గొన్నారు.


