సాగునీటికి డోకా ఉండదు
చందంపేట : మెట్టభూములను సాగులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టిన అంబాభవాని లిఫ్టు పనులు నిలిచిపోయాయి. నేరెడుగొమ్ము మండలంలోని 13వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ లిఫ్టుపై మండల రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. లిఫ్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి సాగు నీరు అందించాలని ఇక్కడి రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతోంది. 2022లో బీఆర్‌ఎస్ హయాంలో రూ.184.56 కోట్ల వ్యయంతో అంబాభవాని ఎత్తిపోతల పనులను అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సాగర్ వెనుక జలాల నుంచి నీటిని తీసుకుని నేరెడుగొమ్ము మండలంలోని 13వేల ఎకరాలకు అందించాలనేది ఈ లిఫ్టు ఉద్దేశం. రెండేళ్ల కాలవ్యవధిలో నాటికి ఈ లిఫ్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
కృష్ణా జలాలు పెరిగితే పనులు సాగవు..
నాగార్జునసాగర్ నీటిమట్టం పెరిగినప్పుడు అంబాభవాని లిఫ్టు పనులు చేపట్టే ప్రాంతాన్ని కృష్ణా జలాలు ముంచెత్తుతాయి. పంప్ హౌస్‌లోకి నీరు చేరుతుంది. పనులు చేపట్టేందుకు వీలుండదు. ప్రసుత్తం సాగర్‌లో నీరు తక్కువగా ఉన్నా.. పనులు చేపట్టడంలో మాత్రం జాప్యం జరుగుతోంది.
నష్టపరిహారం చెల్లింపులో జాప్యం..
అంబాభవాని ఎత్తిపోతల పథకంలో భాగంగా 72 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేసేందుకు భూములను సేకరించారు. కానీ రైతులకు పరిహారం చెల్లించడంలో కొంత మేర జాప్యం జరుగుతోంది. నష్టపరిహారం చెల్లించని కారణంగా లిఫ్టు పనులు కొంత కాలం పాటు నిలిచిపోయాయి. ప్రస్తుతం భూములు సాగు చేస్తుండడంతో రైతులు పొలాల నుంచి పైప్‌లైన్ వేసేందుకు ఇబ్బందులు కలగుతున్నాయి. పంట కాలం పూర్తి అయ్యాక పైప్‌లైన్ వేయాలని రైతులు కోరుతున్నారు.
అంబాభవాని లిఫ్ట్ పైప్‌లైన్ పనులు
అసంపూర్తిగా అంబాభవాని లిఫ్టు పంప్‌హౌస్
అంబాభవాని లిఫ్టులో భాగంగా పంప్‌హౌస్ పనులు 60 శాతం పూర్తయ్యాయి. భూ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక రావాల్సి ఉంది. త్వరలోనే అంబాభవాని లిఫ్టు పనులు పూర్తవుతాయి.
– ప్రభాకర్, ఇరిగేషన్ డీఈ, అంబాభవాని లిఫ్ట్
నాలుగేళ్లవుతున్నా పూర్తికాని ఎత్తిపోతల పథకం
ఫ భూ సమస్యతో నిలిచిన పనులు
ఫ లిఫ్టు పూర్తయితే 13వేల ఎకరాలకు సాగునీరు
ప్రస్తుతం మేము వర్షాలు, బోర్లపైనే ఆధారపడి పంటలను సాగు చేస్తున్నాం. అంబాభవాని లిఫ్టు పనులు పూర్తయితే పంటల సాగుకు డోకా ఉండదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సాగర్‌లో నీరు తక్కువగా ఉంది. సాగర్ నిండితే మళ్లీ పనులకు ఆటంకం కలుగుతుంది. వెంటనే లిఫ్టు పూర్తి చేయాలి.
– కేతావత్ గుండు, రైతు, బచ్చాపురం


