నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 38 మంది తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులును ఫోన్ ద్వారా ఆదేశించారు.
చేనేత ఎన్నికలకు 21 నామినేషన్లు
నకిరేకల్ : నకిరేకల్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సోమవారం వరకు 21 నామినేషన్ల దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బాల్నె వెంకటేశ్వర్లు, సామల గౌరవయ్య, పున్న యాదగిరి, జెల్లా లక్ష్మీనారాయణ, అలువాల వెంకటేశ్వర్లు, చిలుకూరి వెంకటేశ్వర్లు, బొప్పని శంభులింగం, చిలుకూరి సుజాత, మిర్యాల ప్రమీల ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న, మిర్యాల వెంకటేశం, వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, గాజుల సుకన్య, చౌగోని శ్రీనివాస్, రాచకొండ సునీల్, గోలి పద్మ, కందాల భిక్షంరెడ్డి, అశోక్‌రెడ్డి, యాసారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
8, 9 తేదీల్లో టీచర్లకు టెట్
నల్లగొండ : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ నెల 8, 9 తేదీల్లో టెట్‌కు హాజరుకానున్నారు. టెట్ నిర్వహణకు నల్లగొండ పట్టణంలోని ఎస్‌పీఆర్ పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో పరీక్ష కేంద్రం నాలుగో అంతస్తులో ఉండడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలుగుతాయని పీఆర్‌టీయూ–టీఎస్ మహిళా ప్రతినిధి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు కళావతి, జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల జాన్‌రెడ్డి, సయ్యద్ యూసుఫ్ పాషా తదితరుల సోమవారం డీఈఓను కలిసి పరీక్ష కేంద్రంలో లిఫ్ట్‌ను అందుబాటులో ఉంచాలని కోరారు. టెట్‌కు హాజరయ్యే ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటానమన్నారు. దీంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మోహిని
నల్లగొండ టూటౌన్ : వీల్ చైర్ అడాప్టివ్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నూకల మోహిని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాక్సింగ్‌ను జిల్లా, రాష్ట్ర స్థాయిలో విస్తరించడం, క్రీడాకారులను ప్రోత్సహించడం తమ ధ్యేయమని తెలిపారు. దివ్యాంగ క్రీడాకారులకు బాక్సింగ్‌లో సమాన అవకాశాలు కల్పించేందుకు తమ అసోసియేషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.


