ఏఎమ్మార్పీ చెరువులు నింపరా! | - | Sakshi
Sakshi News home page

ఏఎమ్మార్పీ చెరువులు నింపరా!

Sep 7 2026 7:21 AM | Updated on Sep 7 2026 7:21 AM

తక్షణమే నీటిని విడుదల చేయాలి

గుర్రంపోడు : ఏఎమ్మార్పీలో అంతర్భాగమైన వరద కాలువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో, ఏఎమ్మార్పీ ప్రధాన కాలువకు కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి ఆయకట్టులోని చెరువులు నింపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాలకే కాలువలో నీటిని వదులుతున్నారు. కళ్లెదుటే ప్రధాన కాలువ నిండుగా ప్రవహిస్తున్నప్పటికీ.. ఆ నీరు పొలాలకు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావంతో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు కాలువ గేట్ల వద్ద వస్తున్న లీకేజీ నీటిని, మోటార్ల ద్వారా తోడుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు స్పందించి వారబంధీ పద్ధతిలోనైనా ఆయకట్టు మేజర్లన్నింటికీ నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని కోరుతున్నారు.

నిండాల్సిన చెరువులు 93

గతంలో సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు లేనప్పుడు, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసిన మొదట్లోనే ఆయకట్టులోని 93 చెరువులను నింపేవారు. దీంతో ఆయా చెరువుల కింద ఉన్న పంట పొలాలతో పాటు భూగర్భ జలాలు సైతం పెరిగి, బోర్లలో నీటి లభ్యత ఉండేది. తద్వారా రైతులు పంటలను కాపాడుకునేవారు. ఇప్పుడు విచ్చలవిడిగా బోర్లు వేయడం, గత ఏప్రిల్‌ తర్వాత సరైన నీటి విడుదల లేకపోవడంతో ఆయకట్టులో బోర్లు సైతం అడుగంటిపోయిన పరిస్థితి నెలకొంది.

ప్రత్యేక కాల్వలు లేక పాట్లు..

ప్రస్తుతం ఏఎమ్మార్పీ ఆయకట్టులో నేరుగా చెరువులకు నీరు చేరేలా ప్రత్యేక కాలువలు లేవు. కాలువలోని నీరు ఆయకట్టు అంతా పారుకుంటే తప్ప చెరువులకు చేరదు. దీంతో నెలల తరబడి నీరు వదిలితే కానీ మేజర్‌ చెరువులైన చేపూరు, మొసంగి చెరువులు నిండే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో చెరువులను నింపేందుకు గతంలో ప్రత్యేక కాలువలతో పాటు గుడిపల్లి, గుర్రంపోడు, కనగల్‌ వద్ద వాగులపై రిజర్వాయర్లు నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన నిధుల్లోనే రూ.వంద కోట్లు కేటాయించినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. మరోవైపు, వరద కాలువ నుంచి నేరుగా చెరువులకు నీరు చేరే అవకాశం ఏఎమ్మార్పీ ఆయకట్టులో లేదని, పైగా చెరువులను నింపే విషయంలో తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఏఎమ్మార్పీ అధికారులు స్పష్టం చేస్తుండటం గమనార్హం.

ఫ వరదకాల్వ పరిధిలో నీరిచ్చి.. ప్రధాన కాల్వకు ఎందుకివ్వరని రైతుల ప్రశ్న

ఫ వారబందీ పద్ధతిలోనైనా విడుదల చేయాలని డిమాండ్‌

ఫ లీకేజీల నీరు, మోటార్లతో పంటలను కాపాడుకుంటున్న ధైన్యం

ఫ వర్షాభావంతో అడుగంటిన 93 చెరువులు, బోరుబావులు

ఫ ఆదేశాలు లేవంటూ చేతులెత్తేసిన అధికారులు

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండుతున్న పంటలను రక్షించేందుకు తక్షణం ఏఎంఆర్‌పీ ప్రధాన కాలువ వెంబడి ఉన్న మేజర్లన్నింటికీ నీటిని విడుదల చేయాలి. ఆయకట్టులోని చెరువులన్నీ నింపాలి. లేనిపక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు.

– రేపాక లక్ష్మీపతి,

సీపీఐ మండల కార్యదర్శి, గుర్రంపోడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement