వేణుగోపాలస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

వేణుగోపాలస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌

Sep 7 2026 7:21 AM | Updated on Sep 7 2026 7:21 AM

నార్కట్‌పల్లి : శ్రావణమాసం చివరి ఆదివారం సందర్భంగా మండలంలోని గోపలాయపల్లి గ్రామ సమీపానగల వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయాన్ని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు.

దేవరకొండ ఆర్డీఓ బదిలీ

దేవరకొండ : దేవరకొండ ఆర్డీఓ పద్మప్రియ బదిలీ అయ్యారు. దేవరకొండ ఆర్డీఓ హోదాను గతంలోనే సబ్‌ కలెక్టర్‌గా ప్రకటించినప్పటికీ ఐఏఎస్‌ స్థాయి అధికారి రాలేదు. ప్రస్తుతం నిజమాబాద్‌ అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి కరోలిన్‌ చింగ్‌ తియాన్‌మావి దేవరకొండ సబ్‌ కలెక్టర్‌గా రానున్నారు. ఈమె 2024 ఐఏఎస్‌ అధికారి. దేవరకొండ సబ్‌ కలెక్టర్‌గా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

10న కనగల్‌లో ఖోఖో పోటీలు

కనగల్‌ : కనగల్‌లో ఈనెల 10న అస్మిత ఖేలో ఇండియా జిల్లాస్థాయి ఖో ఖో పోటీలను నిర్వహిస్తున్నట్లు ఖోఖో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, నాతి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం వారు ఖోఖో పోటీల ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. 18 సంవత్సరాలలోపు బాలికలు ఈ పోటీలో పాల్గొనవచ్చని తలెఇపారు. వివరాలకు 79979 02745, 99493 37099, 95420 15762 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ నక్కల రమేష్‌, డైరెక్టర్‌ అలివేలు, అయితగోని విజయ్‌, పోలోజు నారి, శేఖర్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫుట్‌బాల్‌ విజేతగా నల్లగొండ జట్టు

నల్లగొండ టూటౌన్‌ : నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు విజేతగా నిలిచిందని ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండారు ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలిపారు. జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన క్రీడాకారిణులకు అసోసియేషన్‌ తరపున వారు శుభాకాంక్షలు తెలిపారు.

యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన హోమం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రథమ ప్రాకార మండపంలో ఆదివారం అర్చకులు శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని భక్తుల నడుమ పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం చేపట్టారు. అనంతరం స్వయంభూ పంచనారసింహులకు బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం నిర్వహించి, నిజాభిషేకం జరిపి సహస్రనామార్చన విశేషంగా చేపట్టి, తులసీ దళాలతో అర్చించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు విశేషంగా జరిపించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో వేద ఆశీర్వచనం పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement