నల్లగొండ టూటౌన్ : అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై ఐదవ రోజు ఆదివారం 500 ఆటోలతో నల్లగొండలోని ఎన్జీ కాలేజీ నుంచి శివాజీనగర్, రామగిరి, పద్మావతీ కాలనీ మీదుగా, బస్టాండ్, మిర్యాలగూడ రోడ్, మాన్యంచల్క, సాగర్ రోడ్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు అక్కడి నుంచి గడియారం సెంటర్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వరకు ఆటోల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆటకెక్కించిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు చీర పంకజ్‌యాదవ్, నిరంజన్‌వలి, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, జమాల్‌ఖాద్రీ, కంచనపల్లి రవీందర్‌రావు, బోనగిరి దేవేందర్, మారగోని గణేష్, బాణావత్ దీప్లా, గోపగాని రాజశేఖర్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, శ్రీనివాస్, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


