చేప పిల్లలకు టెండర్లు | - | Sakshi
Sakshi News home page

చేప పిల్లలకు టెండర్లు

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

చేప పిల్లలకు టెండర్లు పిలిచాం

ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచింది. ఈనెల 17వ తేదీన టెండర్లు తెరుస్తారు. జిల్లాలో నిండిన చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలను పోయడానికి చర్యలు తీసుకుంటాం.

– సుకీర్తన, మత్స్యశాఖ జిల్లా అధికారి

నల్లగొండ టూటౌన్‌ : మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఉచిత చేప పిల్లల సరఫరా ఉంటుందా లేదా అనే మీమాంసలో ఉన్న ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. జిల్లాకు 5.98 కోట్లు చేప పిల్లలు కావాలని మత్స్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించడంతో టెండర్లు పిలిచారు. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు టెండర్‌ దాఖాలు చేశారు. ఈనెల 17వ తేదీన టెండర్లను ఓపెన్‌ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్‌మెంట్‌ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1167 ఉన్నాయి. చెరువులు, జలశయాల్లో మత్స్యకార సొసైటీల ద్వారా చేప పిల్లలను వదలనున్నారు.

జిల్లాలో 257 మత్స్య సొసైటీలు..

జిల్లా వ్యాప్తంగా 257 వరకు మత్స్య పారిశ్రామిక సహాకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 27 వేల మంది సభ్యులు ఉన్నారు. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 60 వేల మందికి పైగా ఉచిత చేప పిల్లల ద్వారా జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. ఉచిత చేప పిల్లల పథకం వల్ల పేద మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. పెద్ద రిజర్వాయర్లు అయిన నాగార్జునసాగర్‌, డిండి, పెద్దదేవులపల్లి, అయిటిపాముల, కనగల్‌ జలశయాల్లో కూడా ఉచిత చేప పిల్లలను వదలడం ద్వారా వేలాది మందికి ప్రయోజనం చేకురనుంది.

ఆలస్యంగా టెండర్లు..

ఉచిత చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అక్రమాల కారణంగా ఈ పథకంపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. చేప పిల్లల లెక్కింపులో అక్రమాలు, నాణ్యమైన పిల్లలు పంపిణీ చేయని కారణంగా మత్స్యకారులకు పెద్దగా ప్రయోజనం చేకూరడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేప పిల్లల కోసం సొసైటీలకు నేరుగా నగదు పంపిణీ చేయాలని డిమాండ్‌ వస్తుండడంతో ప్రభుత్వం ఈ ఏడాది ఆలస్యంగా చేప పిల్లల పంపిణీపై నిర్ణయం తీసుకుంది. ఉచిత చేప పిల్లల టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను సరఫరా చేయడకుండా మత్స్యకారులను మోసం చేస్తున్న విషయాలు పలుసార్లు బయట పడిన విషయం తెలిసిందే. సకాలంలో చేప పిల్లలు పంపిణీ జరుగకపోవడం, పంపిణీ చేసినా చేప పిల్లలు నాణ్యత లేని కారణంగా బరువు పెరగకపోవడంతో మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. దాంతో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో టెండర్ల ప్రక్రియ కూడా జాప్యం జరిగింది. ఈనెల 17న టెండర్లు విప్పనుండగా టెక్నికల్‌ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ ఎట్టకేలకు టెండర్లు పిలిచిన సర్కార్‌

ఫ 17న తెరుచుకోనున్న టెండర్లు

ఫ జిల్లాకు రానున్న 5.98 కోట్ల చేప పిల్లలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement