నార్కట్‌పల్లి, శాలిగౌరారం : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. నార్కట్‌పల్లిలో నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు దిగిన ఆ పార్టీ నాయకులు మేడబోయిన శ్రీనివాస్, బిల్లకంటి శ్రీకాంత్, నడింపల్లి శ్రవణ్‌కుమార్, మునుకుంట్ల గణేశ్, పాలకూరి రమేశ్‌ను మంగళవారం నార్కట్‌పల్లి పోలీసులు దీక్షాస్థలి వద్ద అరెస్ట్ చేసి మొదటగా చిట్యాల పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి శాలిగౌరారం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న వర్షిత్‌రెడ్డి శాలిగౌరారం స్టేషన్‌కు చేరుకొని ఎస్సై బాబుతో పాటు అరెస్ట్ అయిన నాయకులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు బీజేపీ నాయకులను పూచీకత్తు లేకుండా విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ బయట వర్షిత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తుందని, పోలీసులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. మంగళవారం సాయంత్రం నార్కట్‌పల్లిలో రాస్తారోకో చేసి.. దీక్ష చేస్తున్న కార్యర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి నకిరేకంటి మొగులయ్య, సూర్యాపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ జమ్ము రమేశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్, నాయకులు అక్కెనపల్లి సైదులు, బోడ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి


