కనగల్ : మండల కేంద్రానికి చెందిన మదర్‌థెరిసా అవార్డు గ్రహీత డాక్టర్ కంబాల శివలీల విశిష్ట మహిళారత్న బెస్ట్ సర్వీస్ అవార్డు – 2026కు ఎంపికయ్యారు. తన న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను తేజోద్భావం సేవ ట్రస్ట్ చైర్మన్ కె.గాయత్రి గుర్తించి ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేశారు. ఈ అవార్డును ఆగస్టు 14వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దకాకానిలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. అవార్డుకు ఎంపికై న కంబాల శివలీలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో శ్రీరామ్‌కు స్వర్ణం
మిర్యాలగూడ టౌన్ : హనుమకొండలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి 12వ తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో దామరచర్ల మండలం బొత్తలపాలెం మోడల్ స్కూల్ విద్యార్థి ఆర్.శ్రీరామ్ ప్రతిభ కనబరిచాడు. లాంగ్ జంప్ విభాగంలో 6.55 ఫీట్లు దూకి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పోతురాజు నరహరి, ఉపాధ్యాయులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
విద్య, వైద్యం ప్రజలకు
అందుబాటులో ఉండాలి
నాంపల్లి: కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. నాంపల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సీపీఐ ప్రజాచైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వస్తోందన్నారు. సెప్టెంబరు 1న నిర్వహించే చలో ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలపల్లిలో సీపీఐలో చేరిన పలువురికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆర్.అంజయ్యచారి, సుదనబోయిన రమేష్, నేతాళ్ల రాజు, చెల్లం పాండురంగారావు, జగన్, ముదిగొండ మురళీకృష్ణ, వెంకటయ్య, పల్లె సైదులు, సత్తయ్య, నేరెళ్ల సైదులు, గిరి స్వామి, రేవెల్లి సర్పంచ్ బట్టు శ్రీను, కానుగుల మహేష్, మోగుదాల సైదమ్మ, బుషిపాక యాదయ్య, వంగూరి సాయిలు, పల్లేటి దశరథ, చెన్నోజు వెంకటాచారి పాల్గొన్నారు.
రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగ విరుద్ధం
నల్లగొండ టౌన్ : మతం పేరుతో దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ హక్కులను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని యూడీసీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాంసన్, పెదమాము డేవిడ్‌రాజు అన్నారు. సోమవారం నల్లగొండలో వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆగస్టు 10వ తేదీని దళిత క్రైస్తవుల బ్లాక్ డేగా ప్రకటించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దళితులందరికీ సమానంగా రాజ్యాంగబద్ధమైన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో క్రిస్టఫర్, ఆదిమల్ల ప్రభుదాస్, దుబ్బ ఎబినేజరు, రాజు, దుబ్బసి ప్రేమ్‌కుమార్, ఎలీషా, ప్రవీణ్, వరకుమార్, లంక ఎలీషా, దుబ్బ డేవిడ్, మద్దెల చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.


