నాగార్జునసాగర్ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులకు మేలు కోరుతూ ప్రభుత్వం వరుణయాగానికి శ్రీకారం చుట్టిందని సాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున ఈ నెల 10న సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టే వరుణయాగం ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు యాగశాల, ప్రవచనశాల, హెలిపాడ్‌తో తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమించి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల10న ఉదయం 4గంటలకు వరుణయాగం ప్రారంభమవుతుందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత తక్కువగా ఉందని.. వరుణయాగంతో వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తారన్న విశ్వాసం ఉందన్నారు. కార్యక్రమంలో సూర్యపేట జిల్లా ఎస్పీ నర్సింహ, నల్లగొండ అదనపు ఎస్పీ రమేశ్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు.
సాగర్‌లో ఏర్పాట్లను పరిశీలిన
ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్


