రామగిరి (నల్లగొండ) : నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో దర్వేశిపురం వెళ్లే దారిలో ప్రధాన రహదారి వెంట ఉన్న కుంటలో మట్టి తవ్వకం అడ్డగోలుగా సాగుతోంది. రోడ్డు విస్తరణ పనుల పేరుతో ఓ కాంట్రాక్టర్ చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలు కుంట స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. మట్టి తవ్వకానికి ఇరిగేషన్ శాఖ నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉన్నప్పటికీ, సదరు కాంట్రాక్టర్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నారు. కుంటలో దాదాపు 20 ఫీట్ల లోతు వరకు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే కాంట్రాక్టర్ ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


