నల్లగొండ : ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎత్తిపోతల పథకాల భూసేకరణ, చెల్లింపులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. పెండ్లిపాకల రిజర్వాయర్‌కు సంబంధించి ఎస్‌డీసీ యూనిట్ –1 కింద ప్రక్రియను త్వరితగతిన చేపట్టి చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులపై దృష్టి సారించాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాల కింద సేకరించిన భూముల రికార్డులను అన్నిస్థాయిలో భద్రపరచాలన్నారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి మెయిన్ కెనాల్‌కు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కిష్టారాంపల్లి, అంబాభవాని ఎత్తిపోతల పథకాల భూ సేకరణపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌ఓ దశరథ్, స్పెషల్ కలెక్టర్ రమాదేవి, ఆర్డీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


