నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 6.2 మిల్లీమీటర్లు సగటు వర్షం కురిసింది. కనగల్ 32.5 మిల్లీమీటర్లు, చండూరు 30.7, దామరచర్ల 20.7, నిడమనూరు 18.0, మునుగోడు 16.6, త్రిపురారంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం కురిసిన వర్షాలు పత్తి చేలకు జీవం పోసినట్లు అయ్యింది.
ఆరుతడి పంటలు సాగుచేయాలి
కొండమల్లేపల్లి : రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్ సూచించారు. మంగళవారం కొండమల్లేపల్లి కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు చేయాలని సూచించారు. అనంతరం చింతచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని పూల్‌సింగ్‌తండాలో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన అధికారి శేఖర్, శ్రీలక్ష్మి, రవినాయక్, జానకిరాములు రైతులు ఉన్నారు.
శిక్షణతో వ్యాపార అభివృద్ధి
నల్లగొండ : గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి శిక్షణ వేదికగా పని చేస్తుందని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని టీటీడీసీ జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఓరియంటేషన్ అండ్ ప్లానింగ్ వర్క్‌షాప్‌లో కాయన మాట్లాడారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అమలు చేస్తున్న ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ శిక్షణపై ఆయన వివరించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి వారు మార్కెట్‌లో నిలదొక్కుకునేలా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ ఎం.శ్రవణ్‌కుమార్, ఎం.మాధవి, సునీత, వీరయ్య, డీపీఎంలు రామలింగయ్య, శ్రీనివాస్, సోమయ్య, భాషపాక చంద్రశేఖర్, మధుసూదన్‌రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.
7న హైదరాబాద్‌లో ధర్నా
నల్లగొండ : హైదరాబాద్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు దాడి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.సుధాకర్‌రెడ్డి కోరారు. నల్లగొండలోని స్వాతంత్య్ర సమరయోధుల భవన్‌లో మంగళవారం పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలన్నారు. ఆరు విడతలుగా రావాల్సిన డీఏ, డీఆర్‌లను ఇవ్వాలని, మార్చి 2024 నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు రావాల్సిన బకాయిలను సత్వరమే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, జంగయ్య, పాండరీ, దుర్గయ్య పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మాడుగులపల్లి : సహకార బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోని పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవాలని జిల్లా సహకార బ్యాంక్ ఈఓ శంకర్‌రావు, జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ జివి.రమేష్, నాబార్డ్ డీడీఎం వినయ్‌కుమార్, కోఆపరేటీవ్ బ్యాంకు ప్రతినిధి కృష్ణలత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మాడుగులపల్లి, కుక్కడం గొర్రెల కాపరులు, పాడి రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాడి పరిశ్రమ అభివృద్ధి, లాభసాటి గొర్రెలు, మేకల కొనుగోలు, వాటి నిర్వహణకు అందించే రుణాలపై అవగాహన కల్పించారు. పశుగ్రాసం పెంపకం, పశువుల ఆరోగ్య సంరక్షణ, ఆధునిక పద్ధతుల అమలుతో పశుసంపదను అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఉరిబండి శ్రీనివాస్‌యాదవ్, సైదులుయాదవ్, సర్పంచ్ అరూరి నరేష్, పశువైద్యాధికారి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


