నందికొండ మున్సిపాలిటీలో వరుసగా వివాదాలు
సీడీఎంఏకు కమిషనర్ అటాచ్?
నేను సోమవారమే విధుల్లో చేరారు. అవినీతి ఆరోపణల విషయం నాకేమీ తెలియదు. వస్తున్న ఫిర్యాదులపై తగు విచారణ జరిపిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తా.
– కోటేశ్వర్‌రావు, మున్సిపల్
కమిషనర్, నందికొండ
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో వరుస వివాదాలు, తరచూ కమిషనర్ల బదిలీలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై వస్తున్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడిన ఆరేళ్ల కాలంలోనే ఏకంగా 12 మంది కమిషనర్లు మారడం ఇక్కడి పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నియామకాల్లో ఆది నుంచి అక్రమాలే..
మున్సిపాలిటీ ప్రారంభ దశ నుంచే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కొందరు కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరిట భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అవే తరహా అక్రమాలు పునరావృతమవుతున్నాయి. గతంలో కమిషనర్‌గా పనిచేసిన దండు శ్రీను, పారిశుద్ధ్య కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నిధుల్లో సుమారు రూ.12 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది ఒత్తిడితో అందులో కొంత మొత్తం తిరిగి జమ చేసినప్పటికీ, పూర్తిస్థాయి విచారణ నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఒకే పోస్టులో ఇద్దరు ఉద్యోగులు..
తాజాగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సైదులు కేవలం 57 రోజుల వ్యవధిలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. జూన్ 27న చింతలపాలెంకు చెందిన మండాది కాశయ్యకు కంప్యూటర్ ఆపరేటర్‌గా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నెల కూడా గడవకముందే జూలై 24న కాశయ్యను విధులనుంచి తప్పుకోవాలని మౌఖికంగా ఆదేశించి, అదే పోస్టులో అశోక్‌రెడ్డి అనే వ్యక్తిని కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఆయనే విధులు నిర్వహిస్తున్నారు.
వివాదాస్పదమైన నియామకం
ఈ పోస్టు వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే పోస్టులో పనిచేసిన ధనావత్ సురేష్ రూ.3 లక్షల లంచం ఇచ్చి చేరాడని, ఆయన రాజీనామా చేసే సమయంలో కాశయ్య నుంచి రూ.1 లక్ష తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాాశయ్య నియామకం వేళ.. ఆయన ఇచ్చిన రూ.లక్షతో కలిపి కమిషనర్, కొందరు స్థానిక నాయకులకు రూ.5 లక్షల వరకు ముట్టినట్లు చర్చ నడుస్తోంది. అంతలోనే కాశయ్యను తొలగించి అశోక్‌రెడ్డిని నియమించడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.
నిబంధనలకు నీళ్లు!
సాధారణంగా మున్సిపాలిటీల్లో అవుట్‌సోర్సింగ్ నియామకాలను ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీ ద్వారా, కలెక్టర్ ఆమోదంతో చేపడతారు. వేతనాలు కూడా సదరు ఏజెన్సీ ద్వారానే చెల్లిస్తారు. కానీ, ఏజెన్సీ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనరే నేరుగా నియామక ఉత్తర్వులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫ ఒకే పోస్టుకు నెల రోజుల
వ్యవధిలో ఇద్దరి నియామకం
ఫ రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు
ఫ బాధ్యతలు స్వీకరించిన 57 రోజులకే కమిషనర్ బదిలీ
నందికొండ మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జోక్యంతో కమిషనర్ సైదులను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కార్యాలయానికి బదిలీ చేసినట్లు మున్సిపల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అవినీతి జరిగినట్లు ఆరోపణలు, అవుట్ సోర్సింగ్ నియామకాలు, పీఎఫ్ నిధుల దుర్వినియోగం, ఒకే పోస్టులో ఇద్దరికి ఉద్యోగం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


