నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించి ప్రజలను కలుస్తారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులతో సమీక్షించనున్నారు.
శాఖాపురంలో వైద్యశిబిరం
నిడమనూరు : మండలంలో శాఖాపురంలో అధికారులు శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది జ్వర పీడితులు వైద్యం పొందారు. 17 మందికి సాదారణ రక్త పరీక్షలు నిర్వహించి, అనుమానిత 3 రక్త నమూనాలను నల్లగొండ ల్యాబ్‌కు పంపించారు. 150 ఇళ్లలో ఆశ కార్యకర్తలు జ్వర సర్వే చేశారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టిలని డీఎల్‌పీఓ రాఘవరావును డీపీఓ ఆదేశించారు. శనివారం డీఎల్‌పీఓ గ్రామంలో పర్యటించి మురుగు కాల్వల పూడికతీత, ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైదులు, సర్పంచ్ చేకూరి సూర్యానారాయణ స్థానికులు ఉన్నారు.
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వాలు విఫలం
డిండి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు యాదగిరిగుట్టలో నిర్వహించే రాష్ట్ర మహాసభలో ఉపాధి, విద్య, వైద్యం, యువత హక్కులపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెపాపరు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎనమల, బుచ్చిరెడ్డి, మైనొద్దీన్, కనకాచారి, శైలేష్, ప్రేమ్‌కుమార్ వినయ్, కళ్యాణ్ పాల్గొన్నారు.
పోస్టాఫీస్‌ల ద్వారా మెరుగైన సేవలు
చిట్యాల : తపాల శాఖలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు వేగవంతమైన సేవలను అందించాలని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్(సీపీఎంజీ) డీఎస్‌వీఆర్.మూర్తి సూచించారు. చిట్యాల పోస్టాఫీస్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలు చేరవేసేలా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లు పనిచేయాలన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అందుగుల మల్లయ్య నామినీ అందుగుల రోహిణమ్మకు తపాల శాఖ ద్వారా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ పోస్టాఫీసుల సూపరిండెండెంట్ నరేంద్రబాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ జేనేద్రకాంత్, సునిల్‌కుమార్, రాజశేఖర్, రమేష్, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ డిమాండ్ పెరిగింది
నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడం, జలవిద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా వ్యవసాయానికి రోజుకు 14 నుంచి 16 గంటల వరకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు పెద్దఎత్తున కొత్త బోరు బావులు తవ్వడంతో విద్యుత్ లైన్లపై అదనపు లోడ్ పడుతోందని.. అక్కడక్కడా తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని రైతులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖ పరంగా ఎలాంటి తప్పిదం, నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు.


