హాలియా: అనుముల మండలంలోని ఐదు గ్రా మాలకు గురువారం ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. మండలంలోని హజారిగూడెం, నాయుడుపాలెం, చల్మారెడ్డిగూడెం, కొట్టాల, సూరేపల్లి గ్రామాలకు 25 ఏళ్ల క్రితం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అనంతరం నుంచి బస్సు రావడం లేదు. దీంతో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పలు గ్రామాల సర్పంచ్‌లు సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి దేవరకొండ బస్ డిపో మేనేజర్ విజయకుమార్‌తో మాట్లాడడంతో సూరేపల్లి నుంచి హైదరాబాద్ వరకు బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ గ్రామాలకు బస్సు రావడంతో ప్రజ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అనుముల మండల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ యాదవ్, డిపో మేనేజర్ విజయకుమార్, నాయకులు పాల్గొన్నారు.


