రామగిరి(నల్లగొండ) : ప్రతి విద్యార్థి ఆశించిన స్థాయిలో అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని డీఈఓ సుశీందర్‌రావు అన్నారు. చర్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో నల్లగొండ మండల ఎస్టీజీ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండో రోజైన బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నూతన బోధనా పద్ధతులను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె.అరుంధతి, ఆర్పీలు శ్రీనివాస్, నాగయ్య, క్రాంతి, రవి, ఉమ తదితరులు పాల్గొన్నారు.
నిడమనూరు : అర్హులు ఓటుహక్కు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు కృషిచేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత అన్నారు. బుధవారం నిడమనూరు మార్కెట్‌లో కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు. నిడమనూరు మండలంలో 35,731 ఓటర్లు ఉండగా, 33,137 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ దరఖాస్తులు డిజిటలైజ్ అయ్యాయని పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్‌కుమార్ డీసీసీ అధ్యక్షుడు కై లాష్‌నేతకు తెలిపారు. 91 శాతం ఎన్యుమరేషన్ డిజిటలైజ్ చేయడానికి సహకరించిన బీఎల్‌ఏలను కై లాస్ నేత అభినందించారు. కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, కాంగ్రెస్ నిడమనూరు మండల అధ్యక్షుడు నర్సింగ్ విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ సత్యం, పార్టీ కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగుల శీను, నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు బుర్రి వెంకన్నయాదవ్, నాయకులు కృష్ణ, నరేష్, పోలె రవి ఉన్నారు.
సినారె సాహిత్యం..
నైతిక విలువల దీపిక
రామగిరి (నల్లగొండ) : ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం నైతిక విలువలతో కూడుకున్నదని, సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ కౌండిన్య అన్నారు. బుధవారం నల్లగొండ ఎన్జీ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలను, సృజనాత్మక రచనల విశిష్టతను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. సినారె రాసిన పాటలను స్వయంగా పాడి వినిపించి అలరించారు. కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ సినారె మాటా పాట రెండూ తెలుగు జాతిని పరవశింపజేశాయని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్జీ కళాశాల తెలుగు శాఖాధిపతి శ్రీధర్, అధ్యాపకులు సైదులు, భూపాల్, అంజయ్య పాల్గొన్నారు.


