గుర్రంపోడు : హరిత విప్లవం పుణ్యమా అని అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటి ద్వారా దిగుబడి సాధించే క్రమంలో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పెంచారు. కాలక్రమంలో వాటి దుష్ఫలితాలను గ్రహించి, తిరిగి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేసుకోవడం రైతులకు ఎంతో లాభదాయకం. దీని తయారీ విధానంపై అనుముల ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి అందిస్తున్న సూచనలు ఆయన మాటల్లోనే..
వ్యర్థాల నుంచే నాణ్యమైన ఎరువు..
వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో తయారయ్యే వర్మీ కంపోస్టును అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా చెప్పవచ్చు. పాక్షికంగా కుళ్లిన వ్యర్థాలను వానపాములు తిని, విసర్జించిన పదార్థాన్నే వర్మీ కంపోస్టు అంటారు.
తయారీ విధానం ఇలా..
u అందుబాటులో ఉన్న స్థలం, వ్యర్థాలను బట్టి 3 అడుగుల వెడల్పు, కావలసినంత పొడవుతో బెడ్‌లను ఏర్పాటు చేసుకోవాలి.
u వర్షం, నేరుగా పడే సూర్యరశ్మి, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కోసం బెడ్‌లపైన తాటాకుల పందిరి లేదా రేకులతో కప్పు నిర్మించాలి.
u బెడ్ అడుగు భాగంలో సిమెంట్ ఫ్లోర్ లేదా పేడతో గట్టిగా అలికిన నేల ఉండేలా చూసుకోవాలి.
u ముందుగా అడుగు భాగం నుంచి 10సెం.మీ. ఎత్తు వరకు పాక్షికంగా కుళ్లిన వ్యర్థాలను వేసి, పలుచగా నీరు చల్లాలి. ఆ తర్వాత 15 నుంచి 30 సెం.మీ. మందంతో సేంద్రియ వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు తదితరాలను వేయాలి. దీనిపైన మరోసారి నీరు చల్లి, వరిగడ్డి లేదా పాత గోనె సంచులతో కప్పి ఉంచాలి.
u ప్రతిరోజూ కొద్దిగా నీరు చల్లుతూ ఉండాలి. వారం రోజుల తర్వాత చదరపు మీటరుకు 1,000 వానపాముల చొప్పున వదలాలి. మధ్యమధ్యలో బెడ్‌ను నెమ్మదిగా కదిలిస్తూ ఉండాలి.
u బెడ్‌లో వేసిన వ్యర్థాలు తేలికగా, నల్లగా, వాసన లేకుండా మట్టిలా మారితే వర్మీ కంపోస్టు తయారైనట్లు గుర్తించాలి. ఈ దశలో నీరు చల్లడం ఆపేస్తే.. వానపాములన్నీ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఆ తర్వాత పైన ఉన్న ఎరువును జల్లెడ పడితే నాణ్యమైన వర్మికంపోస్టు లభిస్తుంది. కింద మిగిలిన వానపాములను మరో బెడ్‌లోకి మార్చుకోవచ్చు.
u సేంద్రియ వ్యర్థాలు వేసేటప్పుడు అందులో ప్లాస్టిక్ కవర్లు, గాజు పెంకులు లాంటివి లేకుండా చూసుకోవాలి.
u బెడ్‌లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త
వహించాలి.
వర్మీ కంపోస్టుతో ఉపయోగాలు
u నేలలో సేంద్రియ కర్బనం శాతం పెరుగుతుంది.
u భూమి భౌతిక, రసాయన పరిస్థితులను
మెరుగుపరుస్తుంది.
u భూసారాన్ని పరిరక్షిస్తూ, పంట ఉత్పాదకతను పెంచుతుంది.
u భూమిలో గాలి ప్రసరణ, తేమను నిల్వ
చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
u మొక్కలు పోషకాలను సులభంగా
గ్రహించేందుకు తోడ్పడుతుంది.
u పండ్ల తోటల్లో అయితే చెట్టుకు 5 కిలోలు, పూల కుండీల్లో 250 గ్రాముల చొప్పున ఈ ఎరువును వాడుకోవచ్చు.
అనుముల ప్రాంతీయ ఉద్యానవన
అధికారి మురళి సూచనలు


