తిరుమలగిరి (సాగర్) : వ్యవసాయ రంగంలోకి ఎన్ని అత్యాధునిక యంత్రాలు వచ్చినా, ట్రాక్టర్ల వినియోగం పెరిగినా.. పత్తి సాగులో మాత్రం కాడెద్దులదే కీలక పాత్ర. పొలం చదును చేయడం, విత్తనాలు వేయడం నుంచి కలుపు తీయడం వరకు ఎద్దులను ఉపయోగించడం గ్రామాల్లో పరిపాటి. వర్షాధారంగా పత్తి సాగుచేసే రైతులు.. చేనులో కలుపు నివారణ కోసం గుంటక తోలడానికి నేటికీ అరకపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో అరకకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.
పెరిగిన డిమాండ్.. కొరతతో ఇబ్బందులు
ఒకప్పుడు గ్రామాల్లో రైతులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ, కలిసికట్టుగా పనులు చేసుకునేవారు. కానీ.. పశుగ్రాసం కొరత, కూలీల సమస్యలకు తోడు ప్రభుత్వం నుంచి యంత్రాలపై రాయితీలు అందుతుండటంతో ట్రాక్టర్ల వినియోగం పెరిగింది. పశువుల పెంపకాన్ని రైతులు భారంగా భావించడంతో గ్రామాల్లో కాడెద్దుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా 10 నుంచి 15 మందికి మించి ఎద్దులున్న రైతులు కనిపించడం లేదు. అయితే, పత్తిలో కలుపు తీసేందుకు చిన్న, సన్నకారు రైతులకు ఎద్దులే కీలకం కావడంతో.. ఆ కొద్దిమంది రైతులకే చేతినిండా పని దొరుకుతోంది.
ఎకరాకు వెయ్యి రూపాయలు..
కాడెద్దుల కొరత తీవ్రంగా ఉండటంతో అరక అద్దెలు కూడా భారీగా పెరిగాయి. పత్తిలో గుంటక తోలేందుకు గత ఏడాది ఎకరాకు రూ.800 తీసుకోగా, ఈ ఏడాది దానిని రూ.1,000కి పెంచారు. ఒక్కో రైతు రోజుకు సుమారు 3 నుంచి 4 ఎకరాల్లో గుంటక తోలుతారు. గుత్తా పద్ధతిన అయితే కనీసం మూడు ఎకరాలు పూర్తి చేస్తారు. ఈ లెక్కన కాడెద్దులు ఉన్న రైతులు రోజుకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు సంపాదిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతులకు అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
అత్యాధునిక యంత్రాలు
ఎన్ని వచ్చినా కాడెడ్లకే డిమాండ్
తగ్గుతున్న పశుసంపద..
ఎద్దులున్న రైతులకు చేతినిండా పని
ఎకరాకు గుంటుక తోలితే రూ.1,000
రోజుకు రూ.3 వేల నుంచి
రూ.4 వేల వరకు ఆదాయం


