నకిరేకల్ : భారతీయ సంస్కృతిలో గురువు స్దానం అత్యున్నతమైనదని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని ఐశ్వర్య సాయి మందిరంలో మంగళవారం సాయంత్రం వ్యాస మహర్షి గొప్పతనం, చతుర్వేదాలపై ఆయన తన ప్రవచనాలను భక్తులకు వినిపించారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే శక్తి గురువుకు ఉందన్నారు. మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలను మానవాళికి అందించిన వేద వ్యాసుడే జగద్గురువని పేర్కొన్నారు. అందుకే ఆయన జన్మదినమైన గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటామని వివరించారు. శ్రీసాయి లీలామతం భక్తి మార్గమన్నారు. షిర్డీ సాయిబాబా అవతార విశేషాలను, ఆయన అందించిన శ్రద్ద విశ్వాసం, ఓర్పు, సందేశాలను భక్తులకు వివరించారు. సాయిబాబా చూపిన సమతా భావం, మానవతా దృక్పథం నేటి సమాజానికి ఎంతో ఆదర్శమన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. ఈ సందర్బంగా ఐశ్వర్యసాయి మందిరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి దాచేపల్లి శ్రీనివాస్, గోదాదేవి, దాచేపల్లి సాకేత్‌కుమార్ భావన సహకరించారు. ఈ కార్యక్రమంలో సాయి మందిరం ట్రస్ట్ చైర్మన్ తొనుపునూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, కోశాధికారి బాణాల రాంరెడ్డి, మాజీ చైర్మన్ వనమా వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి దుర్గి మురళీధర్ శర్మ, ట్రస్ట్ ప్రతినిధులు రాపోలు రఘునందన్, మంజుల, నోముల గోవిందరాజులు, వలిశెట్టి స్వప్న, బ్రహ్మదేవర వేణు, ఉప్పల వెంకటరమణ, వలిశెట్టి భిక్షమయ్య, ద్యాస పద్మ, కందగట్ల మమత, సునీత తదితరులు పాల్గొన్నారు.
ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు


