గచ్చిబౌలి, బొమ్మలరామారం : ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ లారీని కారు ఢీకొనడంతో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలానికి చెందిన యువకుడు, యువతి మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన ముత్యాల రవీందర్‌రెడ్డి కుమార్తె ప్రణీతరెడ్డి(20) హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే మండలం నాయకునితండాకు చెందిన కానావత్ హఠ్యానాయక్ కుమారుడు సురేందర్(22) స్వగ్రామంలోనే డెయిరీ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరు గతంలో కలిసి చదువుకున్నారు. కొద్దిరోజుల క్రితం సురేందర్ స్విఫ్ట్ కారు కొనుగోలు చేశాడు. సోమవారం సాయంత్రం బొమ్మలరామారం నుంచి కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్ వద్ద తన స్నేహితురాలైన ప్రణీతరెడ్డిని కారులో పికప్ చేసుకున్నాడు. సాయంత్రం వట్టినాగులపల్లి నియోపోలిస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేందర్, ప్రణీతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కారు లారీ కింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. కారును క్రేన్ సహాయంతో పక్కకు తీసి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీతరెడ్డి, సురేందర్ మృతితో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొన్న స్విఫ్ట్ కారు
బొమ్మలరామారం మండలానికి
చెందిన యువతి, యువకుడు దుర్మరణం


