మిర్యాలగూడ : రైతులు పండించే పంటలకు మద్తు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామంలో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన నల్లగొండలో నవంబర్ నెలలో రైతు సంఘం జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ సభలకు రైతులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మంగారెడ్డి, రవినాయక్, అప్పారావు, కాంతారెడ్డి, ఉమాకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కోటిరెడ్డి, బెనర్జీ, కన్యానాయక్, తదితర రైతులు పాల్గొన్నారు.


