ఫ ఆర్డీఓకు వృద్ధురాలి వినతి
వేములపల్లి : తమ ఆస్తి తమకు అందేలా న్యాయం చేయండి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు గగ్గినపల్లి అనసూయ సోమవారం ప్రజావాణిలో మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డికి వినతిపత్రం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. గగ్గినపల్లి అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఇద్దరికి తమ భూమిని సమానంగా పంచి వృద్ధాప్య వైద్య ఖర్చుల కోసం, తమ జీవనోపాధి కోసం 3.11ఎకరాల భూమిని ఉంచుకుని తమ బాధ్యతలు చూసుకుంటున్న మనుమడికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిలో తమకు వాటా కావాలంటూ పెద్ద కుమారుడు, కోడలు, వారి కుమారుడు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. కదల్లేని స్థితిలో వీల్ చైర్‌లో ఉన్న తన భర్త బుచ్చిరెడ్డిపై గతంలో చెప్పుతో దాడి చేయగా కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాలేదు. నాటి నుంచి కేసును ఉపసంహరించుకోవాలని లేకపోతే ట్రాక్టర్‌తో తొక్కి చంపుతామంటూ బెదిరిస్తుండడంతో వేములపల్లి పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని ఆర్డీఓను వేడుకున్నారు.


