చిట్యాల: విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం చిట్యాల మండలంలో విద్యుత్ శాఖ అధికారులు మూడు రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలనివ్వడంతో, నల్లగొండ డివిజన్‌లోనే చిట్యాల మొదటి స్థానంలో నిలిచినట్లు అధికారులు సోమవారం తెలిపారు. చిట్యాల మండల వ్యాప్తంగా సుమారు 55 లక్షల రూపాయలకుపైగా, చిట్యాల మున్సిపాలిటీలో రూ.21 లక్షల 70 వేల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఎస్‌ఈ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టి, బకాయిల వసూలుకు ఇన్‌చార్జ్‌లను నియమించి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిట్యాల మండలంలో ఈ నెల 23, 24, 27 తేదీల్లో బకాయిల వసూలు ఇన్‌చార్జ్, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి కె.భిక్షపతి కార్యాచరణ చేపట్టారు. చిట్యాల మున్సిపాలిటీలో మూడు రోజుల్లోనే 11 లక్షల 60 వేల రూపాయల విద్యుత్ బకాయిలను వసూలు చేశారు. సోమవారం ఏడీఏ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో లైన్‌మెన్ ఈశ్వర్ వినియోగదారులను స్వయంగా కలిసి బకాయిలు వసూలు చేశారు.


