యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు జరిపించారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజ లను భక్తుల మధ్యన జరిపారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు.


