మిర్యాలగూడ : అంగన్‌వాడీల పోస్టుల భర్తీ విషయంలో సమగ్ర విచారణ జరిపిన తరువాతనే అర్హులైన అభ్యర్థులతో పోస్టుల భర్తీ చేస్తామని ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి అన్నారు. శనివారం ‘సాక్షి’లో ‘అంగన్‌వాడీ పోస్టుల్లో.. అక్రమాల భర్తీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు, రిజర్వేషన్లలో తిలోదకాలు, సర్టిఫికెషన్ల పరిశీలనలో ఆ దరఖాస్తులను ఆమోదించినట్లు వచ్చిన కథనంలో వాస్తవాలను విచారిస్తామన్నారు. సీతా రాంపురం సెక్టార్‌లో ఎస్సీ గ్రూప్–1కు కేటా యించిన పోస్టులకు ఎస్సీ గ్రూప్–2, 3 వారు దరఖాస్తు చేసుకున్నట్లుగా తేలితే సంబంధిత తహసీల్దార్ ద్వారా వాస్తవాలను ధ్రువీకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నా రు. ఆ ఏరియాలో ఎస్సీ గ్రూప్–1 అభ్యర్థి లేని పక్షంలో ఎస్సీ గ్రూప్–2 దరఖాస్తు చేసుకోవచ్చని, వారు కూడా లేనిపక్షంలో ఎస్సీ గ్రూప్ –3 వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


