చట్టాలు, సాంకేతికతపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలు, సాంకేతికతపై అవగాహన అవసరం

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

రామగిరి (నల్లగొండ) : ఆధునిక సమాజంలో వేగంగా మారుతున్న నేరాల స్వభావాన్ని ఎదుర్కొనేందుకు న్యాయవాదులు నిరంతరం నూతన చట్టాలు, సాంకేతిక పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని హైదరాబాద్‌ నల్సార్‌ లా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డి.బాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌, నల్లగొండ బార్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆధునిక నేరాలు, క్రిమినల్‌ న్యాయవ్యవస్థ, నూతన సవాళ్లు, న్యాయపరమైన స్పందనలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నేటి రోజుల్లో సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాలు, డిజిటల్‌ ఫ్రాడ్లు, కత్రిమ మేధస్సు దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డేటా చోరీ, ఆన్‌లైన్‌ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల పరిణామానికి అనుగుణంగా క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థ ఆధునికీకరణ చెందాలన్నారు. ప్రస్తుత క్రిమినల్‌ ట్రయల్స్‌లో డిజిటల్‌ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్‌ రికార్డులు, ఫోరెన్సిక్‌ విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజ్‌, కాల్‌ డేటా రికార్డులు కీలకపాత్ర పోషిస్తున్నాయని, వీటి సేకరణ, సంరక్షణ, కోర్టులో ఆమోదయోగ్యతపై న్యాయవాదులకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. శిక్షలతో పాటు వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు న్యాయం, నిందితుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ జిల్లా అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, మునగాల నారాయణరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌ కుమార్‌, కార్యదర్శి బి.అశోక్‌కుమార్‌, న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, జి.జవహర్‌లాల్‌, భువనగిరి రవి, గుర్రం వెంకట్‌రెడ్డి, నాంపల్లి నరసింహ, ఎన్‌.భీమార్జున్‌రెడ్డి, నాగిరెడ్డి, పందుల సైదులు, నాంపల్లి భాగ్య, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement