నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫోన్‌ద్వారా పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
నకిరేకల్ : డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా నూతన కమిటీని సోమవారం నకిరేకల్‌లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.వెంకటేశం, ఉపాధ్యక్షులుగా ఎం.గోపి, టి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పి.ఏడుకొండలు, కార్యదర్శులుగా ఎం.నాగయ్య, ఈ.జగతి, వీరస్వామి, విజయ్‌కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.సోమయ్య, నాగేంద్రమ్మ, ఎండీ.ఖుర్షధ్‌మియా, పి.వెంకులు, అడిట్ కమిటీ కన్వీనర్‌గా వీరయ్య, సభ్యులుగా ఫిరోజ్‌దేశ్‌ముఖ్, పోతులు గోపాల్‌ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, రాష్ట్ర కార్యదర్శి ఆర్.లింగయ్య ఉన్నారు.
ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీగా మద్దిలేటి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా గణితశాస్త్ర విభాగ అధ్యాపకుడు మద్దిలేటిని నియమిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మద్దిలేటికి యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు అందజేశారు. మద్దిలేటి నియామకంపై అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
సీపీఎం ధర్నాను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ, గ్రంథాలయం, మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రం లైబ్రరీ, స్టడీ సెంటర్లకు వెళ్లి ధర్నాకు హాజరు కావాలని కోరుతూ నిరుద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, పట్టణ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్ల మహేష్, ఆకారపు నరేష్, బొల్లు రవీందర్, పోలే సత్యనారాయణ, మేడి కిరణ్, జంజిరాల శ్రీనివాస్, కిరణ్, అదిల్ పాల్గొన్నారు.
నేడు జూనియర్
కళాశాలల బంద్
నల్లగొండ టూటౌన్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్ చేపడుతున్నట్లు ఏబీవీపీ ఎంజీయూ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగిఫణి హనుమాన్‌చారి, రమావత్ సతీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలో బంద్‌కు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని కోరారు.


