భారీ పతాకం
ఆవిష్కరణకు ఏర్పాట్లు..
నడిగూడెం : భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశాన్ని ఏకం చేస్తూ దేశ కీర్తిని తన మువ్వన్నెల్లో ప్రతిబింబిస్తూ భారతీయులంతా సగర్వంగా సెల్యూట్ చేస్తున్న మన జాతీయ పతాకానికి నడిగూడెం రాజావారి కోటలో రూపకల్పన జరిగింది. నాటి మునగాల పరగణాను నడిగూడెంలోని కోటను కేంద్రంగా చేసుకుని జమీందారు బహుద్దూర్ రాజా నాయిని వెంకటరంగారావు పాలన సాగిస్తున్నారు. ఈ సమయంలో రాజావారికి పింగళి వెంకయ్య పరిచయం కాగా తన కోటకు ఆహ్వానించి వ్యవసాయ అధికారిగా నియమించారు. ఈ సమయంలోనే పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పనకు పూనకున్నారు.
కోట సాక్షిగా త్రివర్ణ పతాకం..
నడిగూడెం రాజావారి కోటలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న పింగళి వెంకయ్య కోట సాక్షిగా జాతీయజెండాకు రూపకల్పన చేశారు. 1916 లక్నోలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయజెండాను ఎగురవేశారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో నేటి విజయవాడ (నాటి బెజవాడ)లో ఎగురువేశారు. గాంధీజీ ఈ సమావేశానికి వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులతోపాటు సత్యం, అహింసకు నిదర్శనమైన తెలుపు రంగు మధ్యలో రాట్నంగల ఒక జెండాను రూపొందించమని కోరారు. దీంతో గాంధీ సూచన మేరకు వెంకయ్య 1921 మార్చి 31న జెండాను పూర్తిస్థాయిలో రూపొందించారు. ఈ జెండాకు రూపకల్పన జరిగి 2021 మార్చి 31న వందేళ్ల వేడుకలను జరుపుకుంది. అయితే 1947 జూలై 22న భారత్య రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ పతాకంలోని రాట్నాన్ని తీసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఏర్పాటు చేశారు. చిహ్నం మార్పు తప్పితే మన పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు.
కోటలో డక్కన్ ఆర్కియాలజీ
అండ్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్
ఏళ్ల తరబడి నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన నడిగూడెం రాజావారి కోటను మునగాలకు చెందిన చరిత్ర నిపుణుడు జితేంద్రబాబు మరమ్మతులు చేయించి అభివృద్ధి పరిచారు. ఇదే కోటలో ప్రస్తుతం జితేంద్రబాబు ఆధ్వర్యంలో డక్కన్ ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా పుస్తకాలు, లక్ష తాళపత్ర గ్రంథాలు ఉంచారు.
జెండా చారిత్రక నేపథ్యానికి గుర్తుగా నడిగూడెంలో 108 అడుగుల ఎత్తుగల స్తంభంపై 30 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు కలిగిన జాతీయజెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తిచేశారు. అధికారికంగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఫ పింగళి వెంకయ్య చేతుల్లో రూపుదిద్దుకున్న త్రివర్ణ పతాకం
ఫ జమీందారు నాయిని వెంకటరంగారావు కోటలో జెండా కూర్పు
ఫ గాంధీజీ సూచనతో తెలుపు రంగుతో తుది మెరుగులు
మన నడిగూడెంలోనే.. జాతీయ జెండా రూపకల్పన
మన నడిగూడెంలోనే.. జాతీయ జెండా రూపకల్పన