
స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించనున్నారు. వివిధ రకాల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్తుల పంపిణీలో మంత్రి పాల్గొననున్నారు. వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన ఎన్జీ కాలేజి, గడియారం సెంటర్, ఇతర కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమయ్యాయి.
మండల ప్రత్యేకాధికారుల
పాత్ర కీలకం
నల్లగొండ: అభివృద్ధి కార్యక్రమాల అమలులో మండల ప్రత్యేకాధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారులు మండలాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. విద్య, వైద్య పథకాల అమలు తీరుపై నివేదికలు సమర్పించాలని సూచించారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని జిల్లా రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని, యూరియా బయటికి పోకుండా చూడాలన్నారు. అనంతరం ప్రత్యేకాధికారులు వారి పరిధిలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, కేజీబీవీలు, హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థల సందర్శన, అధికారుల పనితీరుపై నివేదికలను కలెక్టర్‌కు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ అశోక్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.
ప్రవేశాలకు
స్పాట్ కౌన్సిలింగ్
నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో 2025– 26కు సంబంధించి గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు 19వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సమన్వయ అధికారి బలరాం గురువారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు.
30న డిగ్రీ
6వ సెమిస్టర్ పరీక్ష
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ చదివి 6వ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వారికి ఈనెల 30న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ సీఓఈ ఉపేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
పరిశోధనలతో
విజ్ఞానం పెంపొందుతుంది
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పరిశోధనలపై మక్కువ పెంచుకుంటే విజ్ఞానం పెంపొందుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం విద్యార్థిని వాణి గాయత్రి, ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థిని సనా కౌసర్ ప్రభుత్వ వైద్య సేవల్లో సిబ్బంది, వారి పని ప్రదేశాల్లో ఎదురయ్యే ప్రమాదాలు అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన అంశం స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ జనరల్‌లో ప్రచురితం కావడంతో గురువారం వీసీ వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రొఫెసర్ సరిత, డా. సబినా హరాల్డ్, డా.సురేష్‌రెడ్డి, డా.వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి