
సేంద్రియ సాగులో రాణిస్తున్న పట్టభద్రుడు
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిల్లపాటి గోవర్ధన్‌రెడ్డి ఉన్నత చదువులు చదివి వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్నారు. అర్ధశాస్త్రంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తిచేసిన గోవర్ధన్‌రెడ్డి గత నాలుగేళ్లుగా గోఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించిపోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గుతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో సేద్యం చేస్తున్నారు. రసాయన మందులు లేని ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం కృషిచేస్తున్నారు. గోవుల పెంపకంతో వాటి మలమూత్రంతో జీవామృతం, ఘన జీవామృతం, గో కృపామృతం, కషాయాలు ఉపయోగించి దేశవాళి పంటలను పండిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు వరిలో దేశవాళి రకాలైన నవార, రత్నచోళి, మైసూర్, మల్లిక, మట్ట రైస్, కులాకర్, కృష్ణప్రియ, బహురూపి పండిస్తున్నారు. సేంద్రియ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో ఆశించిన లాభాలు వస్తున్నాయని ఆయన పేర్కొంటున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుడమి పుత్ర పురస్కారాన్ని గతేడాది డిసెంబర్‌లో యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డి అందుకున్నారు. సేంద్రియ వ్యవసాయంపై తాను అవగాహన పెంచుకుంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నానని ఆయన చెబుతున్నారు.