
భూభారతి చట్టం.. రైతులకు వరం
మిర్యాలగూడ, నిడమనూరు, చింతపల్లి : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు వరమని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ అన్నారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా గురువారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం, నిడమనూరు, చింతపల్లి రైతు వేదికల్లో రైతులకు భూ చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ రైతులు భూ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ చట్టాలపై అవగాహన అవసరమని, తద్వారానే రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. రైతుల హక్కులు, సాగు చట్టాలపై అవగాహన కల్పించేందుకు జూలై 28 నుంచి సాగు న్యాయ యాత్ర చేపట్టామని, అక్టోబర్ 2 వరకు 800 పైచిలుకు గ్రామాల మీదుగా 2,400 కిలోమీటర్ల పర్యటన సాగుతుందన్నారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు రసీదు అడిగి తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని పేర్కొన్నారు. అనంతరం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి లీవ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పీఏ హరివెంకట ప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్, ప్రకృతి సాగు నిపుణుడు గున్న రాజేందర్‌రెడ్డి, అడ్వకేట్స్ జీవన్, అభిలాష్, మల్లేష్, ప్రవీణ్, సందీప్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, ఏడీఏ సరితా, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్

భూభారతి చట్టం.. రైతులకు వరం