
మా అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవి ఉంటే తప్పేంటి?
పార్టీలో చేర్చుకునేటప్పుడు సమీకరణాలు ఎందుకు గుర్తుకు రాలేదు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు: ‘నాకు మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు.. నేడు పదవి ఇచ్చేందుకు సమీకరణలు కుదరడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనడం సరైంది కాదు.. నన్ను పార్టీలో చేర్చుకునే సమయంలో సమీకరణలు ఎందుకు గుర్తుకు రాలేదు’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. తన మంత్రి పదవిని ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసని చెప్పారు.
మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెం గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..‘నేను ఏ పదవి కోరుకున్నా మునుగోడు ప్రజల కోసమే. నాకు పదవులపై ఎలాంటి ప్రేమ లేదు. మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు కదా.. మా అన్నదమ్ములిద్దరికి మంత్రి పదవి ఉంటే తప్పేంటి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి. ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు అంటే.. ఇద్దరం సమర్థులం, పరిపాలన చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తులం. అలాంటి వారికి పదవులు ఇస్తే ఎవరికి ఇబ్బంది. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వకుండా సమీకరణల పేరుతో దాట వేస్తున్నారు.
నాకు పదవి రాకపోతే జరిగే నష్టం మునుగోడు ప్రజలకు తప్ప నాకు కాదు. పదవులు ఇచ్చే నిర్ణయం అధిష్టానం చూసుకుంటుంది. నాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో నేను ఎంతవరకైనా ఓపిక పడతా. కానీ, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వకుండా అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తి లేదు. నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతా. మరోమారు ఉద్యమానికి సిద్ధమై తీరుతా.
అలా అని మునుగోడు ప్రజలు తలవంచుకునే పని అసలు చేయను. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన కొనసాగిస్తూ నిధులు ఇవ్వకుండా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుంటే చూసి ఊరుకోలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంను మునుగోడు ప్రజల దగ్గరకు తీసుకొచ్చా. నా రాజీనామా కారణంగానే నియోజకవర్గానికి అప్పటి ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేస్తే ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుంది.
ఇంకా మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమైతా. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలి. ప్రధానంగా కమ్యూనిస్టుల మద్దతు పూర్తిగా అందించాలి’. అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.